కడుపునొప్పి - Stomach Pain in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

January 31, 2019

September 11, 2020

కడుపునొప్పి
కడుపునొప్పి

సారాంశం (Summary)   

'కడుపునొప్పి' అనేది విస్తారమైన పదం. సాధారణంగా పొత్తికడుపు (ఛాతీకి, తొడగజ్జకు మధ్యలో భాగం) లో వచ్చే నొప్పిని 'కడుపునొప్పి' గా సూచిస్తాం. పొత్తికడుపు అనేది కడుపు, నీరు తిత్తి (ప్యాంక్రియాస్), పిత్తాశయం, పేగు, ప్రత్యుత్పత్తి అవయవాలు (లేదా లైంగిక అవయవాలు), మూత్రాశయనాడి వంటి అనేక అవయవాలను కలిగి ఉంటుంది. అందువల్ల కడుపు నొప్పి కడుపులోని ఏ భాగానికైనా గాయం, సంక్రమణం లేదా పుండు, వాపు ఏర్పడడం మూలాన సంభవించవచ్చు.

మనలో అందరూ, ఏదో ఒక సమయంలో, కడుపు నొప్పికి లోనయ్యే ఉంటాం. ఇది చాలా సాధారణమైన రుగ్మతే. సాధారణంగా కడుపు నొప్పి స్వల్పకాలికమైనదే కానీ తీవ్రమైనదేమీ కాదు. అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన వైద్యసాయం అవసరమయ్యే పరిస్థితిని తెచ్చిపెడుతుంది.

కడుపునొప్పికి చికిత్స సాధారణంగా ఆ నొప్పి తీవ్రత, ఆ నొప్పికి దారి తీసిన కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా మందులు, ద్రవం భర్తీ, విశ్రాంతితో పాటు స్వీయ సంరక్షణతోనే నయమవుతుంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే, శస్త్రచికిత్స అవసరం కలుగుతుంది.

కడుపు నొప్పి రకాలు - Types of Stomach Pain in Telugu

కడుపునొప్పి తీవ్రత, కడుపులో నొప్పి ఉద్భవిస్తున్న స్థానం, మరియు నొప్పియొక్క వ్యవధిని బట్టి ఈ క్రింది మూడు విధాలుగా కడుపునొప్పి (పొత్తికడుపు నొప్పి) ని వర్గీకరించవచ్చు.

నొప్పి యొక్క తీవ్రత ఆధారంగా:

  • స్వల్పమైన కడుపు నొప్పి (మైల్డ్ పెయిన్)  సాధారణంగా వచ్చి-పోతుంటుంది. ఇలాంటి నొప్పి సాధారణంగా ఓర్చుకోదగ్గదిగానే ఉంటుంది.
  • పరిమితమైన కడుపు నొప్పి మీ దైనందిన కార్యకలాపాలకు అంతరాయం కలిగించేదిగా ఉంటుంది.
  • తీవ్రమైన కడుపునొప్పి అనేది భరించలేనివిధంగా ఉండి, తక్షణ వైద్య సాయాన్ని  డిమాండు చేస్తుంది.

నొప్పి ఉన్న స్థానం ఆధారంగా:

ఉదరం తొమ్మిది భాగాలుగా విభజించబడింది, మరి ఈ రకమైన నొప్పి ఈ తొమ్మిది భాగాల్లో ఎక్కడైనా సంభవించవచ్చు. కొన్నిసార్లు కడుపు నొప్పి ఒకచోట కాకుండా ఉదరంలో వివిధ భాగాల్లో విస్తరించి ఉంటుంది. నొప్పి ఏదో ఒక భాగానికి మాత్రమే పరిమితం కాదు.

  • కడుపుకు ఎగువన: ఎడమ, మధ్య, మరియు కుడి వైపుల్లో నొప్పి
  • కడుపుకు మధ్యన: ఎడమ, మధ్య, మరియు కుడి వైపుల్లో నొప్పి
  • కడుపుకుదిగువన: ఎడమ, మధ్య, మరియు కుడి వైపుల్లో నొప్పి
  • సూచించిన నొప్పి (పొట్టలో ఒక ప్రాంతంలో ఉద్భవించితే రోగికి మరొక చోటున నొప్పి ఉన్నట్లు భావన కలగడం)

వ్యవధి ఆధారితమైన కడుపునొప్పి:

  • తీవ్రమైన కడుపు నొప్పిని అకస్మాత్తుగా ఎదుర్కొంటున్నప్పుడు అత్యవసర వైద్య సాయం  అవసరం అవుతుంది. ఇలాంటి తీవ్రమైన నొప్పి అపెండిసైటిస్ లో, క్లోమంలోవాపు,  పేగుల్లో వాపు ఏర్పడినపుడు కలుగుతుంది.
  • దీర్ఘకాలిక నొప్పి ఈ కడుపునొప్పి మూడు నెలలకు పైగా నిరంతరంగా రోగిని బాధిస్తూ ఉండి ఉండచ్చు. దీర్ఘకాలిక నొప్పి పిత్తాశయం యొక్క వాపు లేదా పిత్తాశయంలో రాళ్ళేర్పడ్డం వల్ల లేదా జీర్ణకోశ పుండ్లు  కారణంగా ఏర్పడేది.

వైద్య సాయాన్ని ఎప్పుడు తీసుకోవాలి?

అతి బాధాకరమైన కడుపునొప్పే కావచ్చు లేక మరెలాంటి కడుపు నొప్పి అయినా కానీ మీకొచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స పొందడం ఎల్లప్పడూ మంచిది. వికారం మరియు వాంతులుతో పాటుగా ఆకస్మికంగా తీవ్రమైన కడుపు నొప్పి మీకొచ్చినపుడు ఆలస్యం చేయకుండా వైద్యుని సాయం తీసుకోవాలి. అంతేకాదు. అతిసారం, గ్రహణి భేదులు, రక్త భేదులు, బరువు తగ్గిపోవడం, దగ్గినప్పుడు రక్తం పడడం, ఋతు చక్రం కాని సమయంలో యోని రక్తస్రావం కావడం, రక్త వాంతులు, క్రమం తప్పిన ఋతుచక్రం, మూత్రవిసర్జనలో నొప్పి, పురుష పునరుత్పత్తి అవయవాలు లోపల, లేదా వాటి చుట్టుపక్కల నొప్పి, వ్యాయామం చేసే సమయంలో లేదా దైనందిన చర్యల్లో ఛాతీ నొప్పి లేదా కడుపు నొప్పి వచ్చినపుడు ఆలస్యం చేయకుండా వైద్యసాయం పొందాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

కడుపునొప్పికి కారణాలు మరియు ప్రమాద కారకాలు - Causes and Risk Factors of Stomach Pain in Tealugu

కడుపు నొప్పికి అతి మామూలు కారణాలలో కొన్ని ఏవంటే తీవ్రమైన శారీరక శ్రమ కారణంగా కలిగే కండరాల నొప్పి, క్రీడలు లేదా ప్రమాదవశాత్తు దాపురించే గాయం, ఆహార విషప్రక్రియ, ప్రతికూలించిన ఆహారం (లేదా ఆహారపు అలెర్జీ), ఆడవాళ్ళలో ఋతుక్రమ  సంబంధమైన నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం, పొట్టలో చిక్కుకున్న గాలి లేదా గ్యాస్, పుండ్లు, సంక్రమణం, మరియు వాపు. పొత్తికడుపులో ఏర్పడే కణతలు కూడా (పొత్తి) కడుపు నొప్పికి కారణం కావచ్చు.

వివిధ వర్గాల మనుషుల్లో వచ్చే కడుపు నొప్పికి కారణాలు

  • శిశువులలో:
    శిశువుల్లో కడుపు నొప్పి వచ్చినపుడు వాళ్ళు చెప్పలేరు గనుక బాగా ఏడుపు లంకించుకుంటారు. పసిపిల్లల్లో కడుపు నొప్పి వచ్చినపుడు వారిలో అసహనత, సరిగా తినకపోవడం లేదా పాలు తాగకపోవడం, నిద్రపోకుండా ఉండడం వంటి ప్రవర్తనను మనం గమనించవచ్చు. ఇంకా, శిశువుల్లో సర్వ సాధారణమైన కడుపు నొప్పికి శూలనొప్పి,  కడుపులో కలిగే గ్యాస్ సంబంధమైన నొప్పి, పాలు ఇష్టం కాకపోవడం, లేక పాలను జీర్ణం చేసుకోలేకపోవడం(లాక్టోస్ ఇంటోలెరెన్స్)  కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
     
  • చిన్న పిల్లల్లో కడుపునొప్పి
    12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తుంటరి ఆటగాళ్ళు. అలా ఆటల్లో నిమగ్నమైన ఈ చిన్నపిల్లలు ప్రమాదాలకు, అంటువ్యాధులకు గురయ్యే అవకాశం మెండు. ఆట్లాడుతూనే చిక్కిన వస్తువునల్లా నమలడం, చీకడం మరియు చిన్న వస్తువులను అకస్మాత్తుగా మింగేయడం, కలుషితమైన ఆహారం లేదా మట్టిని తినడం, కలుషితమైన నీటిని త్రాగటం వంటి కొన్ని చర్యలు చిన్నపిల్లల కడుపునొప్పికి గల సాధారణ కారణాలు.

    మంత్రం-తంత్రాది వైద్యంతో ప్రమాదకరమైన గృహ ఔషధాలను పిల్లలకు సేవింపజేయడమే వారి ఆరోగ్య స్థితిని క్షీణింపచేస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకి, కొవ్వు పదార్ధాలను పిల్లలకు తినబెట్టడం వల్ల, మూఢ నమ్మకాలకు లోనై, వైద్యం చేసే అర్హత లేని మంత్ర-తంత్రగాండ్ర (quacks) వద్దకు అనారోగ్యం పాలైన పిల్లలను తీసుకొనిపోయి చూపడం, అక్కడ ఆ మంత్ర-తంత్రగాళ్ళు పిల్లలు తింటాడానికి బొగ్గు లేదా బూడిద ఇవ్వడం, మొదలైనవి చేయకూడనివి. సరిగా ఇంకా మాట్లాడలేని పిల్లలు వారి నొప్పిని మనకు సరిగ్గా వ్యక్తపరచలేరు. అందువల్ల, వారి బాల్యదశని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అనారోగ్యానికి గురైన చిన్నపిల్లల్ని అర్హులైన చిన్నపిల్లల వైద్య నిపుణుల (pediatrician) వద్దకు మాత్రమే తీసుకెళ్లి చూపించాలి.
     
  • గర్భిణీ స్త్రీలలో కడుపునొప్పి:
    గర్భం దాల్చిన ప్రారంభ దశలో-గర్భాశయం యొక్క సాధారణ కుదుపులు, కుదింపుల వలన కడుపునొప్పి సంభవించవచ్చు. ఈ స్థితిని ‘బ్రాక్స్టన్ హిక్స్’  కుదుపులు అని పిలుస్తారు. అయినా,  సాధారణంగా ఇలాంటి కుదుపులు కుదింపులు గర్భవతులకు మూణ్నెల్లు దాటాకే వస్తాయి. గర్భవతుల్లో కడుపునొప్పి రావడానికి గర్భస్రావం, స్థానభ్రంశమైన గర్భం (ఎక్టోపిక్ గర్భం) కావడం వంటి వాటిని ఇతర కారణాలుగా పేర్కొనవచ్చు.

    లేటుగా గర్భం దాల్చినవారిలో కడుపు నొప్పి రావడమనేది నరాల నొప్పివల్ల కావచ్చు. పెరుగుతున్న పిండం కల్గించే ఒత్తిడి వల్ల ఉదరంలోని ఇతర అవయవాల్లో కడుపునొప్పి రావచ్చు. గర్భంలోని అండాధారం కారణంగా కూడా కడుపు నొప్పి సంభవించవచ్చు.  ఈ అండాధారం పేగువంటిది. ఇది పిండానికి తల్లి నుండి పోషకాహారాన్న అందిస్తూ ఉంటుంది. ఇది వ్యర్థాల తొలగింపునకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా,  గర్భాశయంలో పగుళ్లు, నెలలునిండకుండానే వచ్చే ముందస్తు పురిటి నొప్పులు కూడా గర్భిణుల్లో కడుపునొప్పికి కారణమవుతాయి.

    తొమ్మిది నెలలు నిండిన గర్భిణుల్లో గర్భాశయంలో బిడ్డను ప్రసవించేందుకు వచ్చే సంకోచాది కుదింపుల వల్ల కూడా పొత్తికడుపులో నొప్పి కలుగుతుంది.

పొట్టలోని స్థానం ఆధారంగా కలిగే కడుపునొప్పికి కారణాలు:

  •  పొట్ట ఎగువ కేంద్రప్రాంతం (epigastric region ):
  •  మీ పొట్ట ఎగువ కేంద్రప్రాంతం లో నొప్పిని అనుభవిస్తుంటే దానికి కింద పేర్కొన్నవే  కారణాలు కావచ్చు:
    • ఆమ్లత్వం (అసిడిటీ): పొట్ట ఎగువ కేంద్రప్రాంతంలో వచ్చే నొప్పికి ఆమ్లత్వం  చాలా సాధారణ కారణం. పొట్టలోని ఆమ్లద్రవం ఆహారవాహికలోనికి మరలి రావడంవల్ల పొట్ట ఎగువ కేంద్ర ప్రాంతంలో కడుపు నొప్పి వస్తుంది.
    • పెప్టిక్ పుండు వ్యాధి: ఆహారాన్ని తిన్న తర్వాత కడుపు లోపలి భాగంలో ఉన్న పగిలిన పుళ్ళు ఈరకం కడుపు నొప్పికి దారితీస్తుంది.
    • జీర్ణాశయ లోపాలు: ‘గ్యాస్ట్రోసోఫాజీయల్ రిఫ్లక్స్ వ్యాధి’ (GERD) అంటారు దీన్ని. జీర్ణాశయ లోపాలు వల్ల వచ్చే కడుపునొప్పిది. నోటిని, కడుపును కలిపేది అన్నవాహిక. కడుపులోనికెళ్లిన పదార్థాలు తరచూ తిరిగి అన్నవాహికలోనికి ప్రవహించే జీర్ణలోపము కారణంగా ఈ కడుపునొప్పి వస్తుంది.(మరింత సమాచారం: GERD చికిత్స
    • హృదయ స్నాయువు బలహీనత: గుండెకు సరఫరా అయ్యే రక్తప్రవాహం బలహీనపడడం వల్ల గుండె తగినంత ఆక్సిజన్ ను పొందలేకపోతుంది. దీన్నే ‘హృదయ స్నాయువు బలహీనత’ లేదా ‘మయోకార్డియల్ ఇస్కీమియా’ తొందర అంటారు. ఈ తొందర ఏర్పడినపుడు కడుపునొప్పి వస్తుంది.
    • కడుపు బృహద్ధమని వాపు: కడుపులోని బృహద్ధమని (శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళము) బలహీనంగా మారి, ఆ ధమనిలో వాపు పెరిగి పెరిగి ఒక చిన్న బెలూన్ లాగా తయారవుతుంది, తద్వారా కడుపు నొప్పి వస్తుంది.
    • మధురవాహిక నొప్పి: పిత్తాశయం మరియు సాధారణ పిత్తవాహికలో అవరోధం ఏర్పడి కలిగే కడుపునొప్పి.
       
  • ​పొట్ట ఎగువన కుడి ప్రాంతం:
    పొట్టకు ఎగువన కుడి ప్రాంతంలో మీరు నొప్పిని ఎదుర్కొంటుంటే, అందుకు కారణాలివే కావచ్చు:
    • తీవ్రమైన కోలిసైస్టిటిస్: పిత్తాశయం యొక్క గోడల  వాపు వలన కలిగే నొప్పి.
    • పిత్త వాహిక: పిత్తాశయ రాళ్ళు పిత్త వాహికను అడ్డుకోవడం కారణంగా కలిగే  కడుపు నొప్పి.
    • తీవ్రమైన హెపటైటిస్: ఇన్ఫెక్షన్, మితం మించిన సారా సేవనం, కొన్ని మందుల దుర్వినియోగం, విష సేవనం లేదా చీము ఏర్పడటం వల్ల కలిగే కడుపునొప్పి.
    • హెపాటోమెగల్లీ: మద్య వ్యసనం కారణంగా మరియు కొన్ని ఔషధాల దుష్ప్రభావం వల్ల కాలేయం అసాధారణంగా వాచిపోవడం లేదా ఊఁదడం
    • చిన్నపేగుల్లో (డ్యూడెనాల్) పుండు: చిన్న ప్రేగు యొక్క ఎగువ భాగంలో పుండు ఏర్పడడం మూలంగా వచ్చే కడుపునొప్పి.
    • గజకర్ణం (హెర్పెస్ జోస్టర్) చిన్నప్పుడు పిల్లల్లో వరిసెల్లా జోస్టర్ సూక్ష్మ జీవి కారణంగా చికెన్ పాక్స్ ( అమ్మవారు ) వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ క్రిమి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గజకర్ణం (Herpes Zoster) రూపంలో బయట పడుతుంది.
    • హృదయ స్నాయువు బలహీనత (మయోకార్డియల్ ఇస్కీమియా): గుండెకు సరఫరా అయ్యే రక్తప్రవాహం బలహీనపడడం వల్ల ఈ వ్యాధి బారిన పడే సాధ్యత ఉంది. ఒక కొవ్వు పదార్ధం ధమనుల గోడలపై గుమిగూడుతుంది. అటుపై గట్టిపడిపోయి ధమనుల్లో గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇలా గుమిగూడిన కొవ్వు "ఫలకం" లా గట్టిపడి గుండెకు రక్తం సరఫరా చేసే ధమనిని పూర్తిగా అడ్డుకుంటుంది. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. శ్వాసలోపం, మెడ నొప్పి, భుజం నొప్పి, శారీరక శ్రమ లేకుండానే చెమట పట్టుట మొదలైనవి ఈ అనారోగ్యస్థితి యొక్క ఇతర లక్షణాలు.
    • కుడి ఊపిరితిత్తి కిందిభాగంలో న్యుమోనియా (Right lower lobe pneumonia): కుడి ఊపిరితిత్తి దిగువ ప్రాంతంలో న్యుమోనియా.
    • కుడి మూత్రపిండంలో రాళ్ళు: ఈ నొప్పితో బాధపడేవారు తరచూ వెనుక వైపున  కుడికి చూపించి అక్కడ నొప్పి ఉందని సూచిస్తారు.
       
  • పొట్ట ఎగువన ఎడమ ప్రాంతం:
    కడుపుకి ఎగువన ఎడమవైపు ప్రాంతంలో నొప్పికి కారణమయ్యే కొన్ని ఆరోగ్య పరిస్థితులివిగో:
    • తీవ్రమైన క్లోమపు నొప్పి: (ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్):  క్షోమం (ప్యాంక్రిస్) యొక్క వాపు కారణంగా ఏర్పడే ఓ మోస్తరు నుండి తీవ్రమైన నొప్పి ఇది.  భోంచేసిన తర్వాత ఈ నొప్పి ఆకస్మికంగా వచ్చి తీవ్రంగా మారుతుంది. ఇలా ఈ నొప్పి చాలా రోజులు ఉండవచ్చు.
    • గ్యాస్ట్రిక్ అల్సర్:  బ్యాక్టీరియా సంక్రమణం, మితం మించిన సారా సేవనం, జ్వరం సమయంలో ఉపయోగించిన కొన్ని మందులు, కొన్ని నొప్పి నివారణా మందులు, మసాలా దట్టించిన ఆహార సేవనం మరియు ఒత్తిడి గ్యాస్ట్రిక్ అల్సర్ కు కారణాలు.
    • గ్యాస్ట్రిటిస్ (కడుపు లైనింగ్ యొక్క వాపు)
    • ప్లీహము యొక్క వాపు, పగలడం, లేదా ప్లీహానికి రక్త సరఫరాలో అంతరాయం.
    • హృదయ స్నాయువు బలహీనత (మయోకార్డియల్ ఇస్కీమియా)
    • ఊపిరితిత్తి ఎడమ వైపు దిగువభాగంలో న్యుమోనియా
    • కిడ్నీ రాళ్ళు: ఈ నొప్పితో బాధపడేవారు తరచూ వెనుక వైపున  ఎడమ వైపుకు చూపించి అక్కడ నొప్పి ఉందని సూచిస్తారు.
       
  • కడుపు కిందిభాగం కుడివైపు ప్రాంతంలో వచ్చే నొప్పి:
    మీరు కడుపు దిగువన కుడివైపున నొప్పిని ఎదుర్కొంటుంటే, అది క్రింది ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు:
    • అపెండిసైటిస్: ఉదరం యొక్క కుడి వైపున ఉన్న పెద్దప్రేగు నుండి విస్తరించి ఉన్న వేలు ఆకారపు గొట్టపు తిత్తి (అపెండిక్స్) యొక్క వాపు ఇది. నొప్పి తీవ్రముగా ఉంటుంది. తరచూ అత్యవసర చికిత్స అవసరమవుతుంది.
    • పగిలిన, స్థానభ్రంశమైన గర్భం: ఫలదీకరణమైన గుడ్డు అండాశయంలో  కాకుండా ఇంకో చోట స్థానమేర్పరచుకుని వృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. దీనివల్ల స్త్రీ బీజ వాహిక బీటలువారి దెబ్బ తింటుంది. .
    • చిన్న ప్రేగుల్లో అడ్డంకి: శస్త్రచికిత్స తర్వాత ఏర్పడే సమస్య ఇది. ఆపరేషన్లో కుట్లు మానేందుకేసిన బ్యాండ్లు కారణంగా ప్రేగుల్లో అడ్డంకి ఏర్పడడం.
    • పేగునొప్పి (ప్రాంతీయ ఎంటేరిటిస్ లేదా క్రోన్స్ వ్యాధి): పేగువాపు కారణంగా వచ్చే ఒక దీర్ఘకాలిక పేగునొప్పి ఇది. ఈ నొప్పి సాధారణంగా చిన్న ప్రేగు మరియు పెద్దప్రేగును రెండింటినీ బాధిస్తుంది.
    • పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి / రుగ్మత: స్త్రీ యొక్క లైంగిక అవయవాలు లేదా పునరుత్పత్తి అవయవాల్లో వాపు వ్యాధి.
    • మెలి వేయబడిన (ట్విస్టెడ్) అండాశయపు తిత్తి: పాక్షికంగా  లేదా పూర్తిగా భ్రమణం చెందిన అండాశయం మరియు (రక్త సరఫరాతో పాటు) ఫెలోపియన్ ట్యూబ్.
    • హెర్నియా: కండరాలు బలహీనపడినప్పుడు, కడుపులోని చిన్న ప్రేగు లేదా కొవ్వు కణజాలం దాని చుట్టుపక్కల కండరాల గుండా చొచ్చుకుని పొడుచుకుని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తాయి. అలా బయటికి కనబడే "ఉబ్బు"ను ‘గిలక’ లేదా ‘హెర్నియా’ (Hernia) అంటాము.
    • మూత్రనాళంలో రాళ్లు (Ureteral calculi): మూత్రనాళం లోపల ఏర్పడే రాళ్ళ వల్ల కూడా పొత్తికడుపులో నొప్పి కల్గుతుంది.
       
  • కడుపు కిందిభాగం ఎడమవైపు ప్రాంతంలో
    ​మీ కడుపు కిందిభాగంలోని ఎడమవైపు ప్రాంతంలో గనుక మీకు కడుపునొప్పి ఉన్నట్లయితే కింద కనబర్చిన ఇంకొన్నిశరీర స్థితిగతులు మిమ్మల్ని బాధిస్తూ ఉండచ్చు.
    • ప్రేగులవాపు (డైవర్టిక్యూలిటీస్): కడుపులోని పేగుల గోడల వెంట ‘డైవర్టిక్యూల’ అనబడే చిట్టి చిట్టి తిత్తులు ఏర్పడి అవి రోగానికి గురవుతాయి.
    • కారే రక్తనాళాలు (లీకింగ్ ఎన్యురిజమ్): ఓ ప్రాణాంతక సంఘటనలో కడుపులోని రక్తనాళాలు పగిలి వాటిగోడలనుండి రక్తం కారడం జరుగుతుంది.
    • పగిలిన మరియు స్థానభ్రంశమైన గర్భం
    •  కటిభాగపు వాపురోగం (Pelvic inflammatory )  
    • మెలిపడిన అండాశయం, బీజావాహిక: పూర్తిగా లేక కొంత మేర మెలిపడిన అండాశయం (ovarian cyst) మరియు రక్తం సరఫరాతో పాటు మెలిపడిన బీజావాహిక.
    • మూత్రనాళంలో రాళ్ళేర్పడే రోగం:  మూత్రనాళం లోపల రాళ్లు ఏర్పడి బాధ కల్గించే కడుపునొప్పి రోగం
    • హెర్నియా వ్యాధి: కండరాలు బలహీనపడినప్పుడు, కడుపులోని చిన్న ప్రేగు లేదా కొవ్వు కణజాలం దాని చుట్టుపక్కల ఉండే 'ఫాసియా' అనే కండరాల గుండా చొచ్చుకుని పొడుచుకుని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తాయి. అలా బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము.
    • పేగు నొప్పి లేదా క్రోన్ వ్యాధి: ఇదొక దీర్గాకాలిక జబ్బు. చిన్న పేగు, పెద్ద పేగు రెండూ వాపుకు గురై కడుపు ఊదిపోయి రోగిని బాధిస్తుంది.
       
  • పొట్ట మధ్య ప్రాంతంలో వచ్చే కడుపు నొప్పి:
    • పెద్ద పేగు వ్యాధి: ఉదరం మధ్య భాగంలో కుడి నుండి ఎడమకు పెద్దప్రేగు అడ్డంగా  వాయడం లేక విస్తరించచడం వల్ల ఏర్పడే కడుపు నొప్పి .
    • కలరా (గ్యాస్ట్రోఎంటెరిటీస్): అతిసారం, వాంతులు మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగి ఉబ్బరించిన ఉదరం మరియు ప్రేగులు వల్ల కలిగే తీవ్ర ఆరోగ్య సమస్య ఇది.
    • అపెండిసైటిస్:  ఉదరం యొక్క కుడి వైపున ఉన్న పెద్దప్రేగు నుండి విస్తరించి ఉన్న వేలు ఆకారపు గొట్టపు తిత్తి (అపెండిక్స్) యొక్క వాపు ఇది. నొప్పి తీవ్రముగా ఉంటుంది. తరచూ అత్యవసర చికిత్స అవసరమవుతుంది.
    • పేగులు కట్టుకుపోయ్యే వ్యాధి: పేగుల్లో అడ్డంకులేర్పడి విపరీతమైన నొప్పి ఏర్పడి కడుపు ఆపరేషన్ అవసరమయ్యే వ్యాధి ఇది.
  • విస్తారమైన కడుపు నొప్పి:
    ఈ విస్తార కడుపు నొప్పి పొట్టలో దాదాపుగా అన్నిచోట్ల సంభవిస్తుంటుంది. నిరంతరంగా నొప్పి ఒక చోటు నుండి మరో చోటుకు బదిలీ అవుతూ ఉంటుంది. నొప్పి కడుపులో ఒక చోట ఉండనే ఉండదు. అందుకే ఇది కడుపులో వచ్చే విస్తృతమైన నొప్పిగా పిలువబడుతుంది. అలాంటి సందర్భాలలో, రోగి గందరగోళమై పోతాడు. నొప్పి పొట్టలో ఏ ప్రాంతంలోంచి వస్తున్నది చెప్పలేక వ్యధ చెందుతాడు ఇలాంటి నొప్పికి ఊహించదగిన కారణాలేవంటే:
    • ఉదరపొర వాపు: ఉదరకుహరాన్ని ఆవరించి ఉండేపొరను 'పెరిటోనియం' లేదా 'ఉదరాంత్రవేష్టనము' అంటారు. పొట్టలోని దాదాపు అన్ని అవయవాలను కప్పి ఉండే ఈ పొరకు బాక్టీరియా క్రిముల లేదా ఫంగల్ సంక్రమణల వల్ల వాపురోగం రావడం మూలాన కడుపునొప్పి ఏర్పడుతుంది.
    • క్లోమము వాపు/క్లోమ క్రోధం (లేదా పాంక్రియాటైటిస్) (Pancreatitis): పొట్టలోని క్లోమం వాచిపోవడంవల్ల వచ్చే తీవ్రమైన కడుపునొప్పి ఇది. అందుకే దీనిని 'అక్యూట్ పాంక్రియాటైటిస్' (Acute Pancreatitis) అంటారు.
    • కొడవలి కణ రక్తహీనత (సికిల్ కణ సంక్షోభం): రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిన వారికి ఈ రోగం దాపురిస్తుంది. కొడవలి ఆకారంలో లేదా వంగిన ఎర్ర రక్త కణాలు చిన్న రక్తనాళాలను అడ్డుకుంటాయి కొంతమందిలో. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కొడవలికణ రక్తహీనతను వంశానుగత రక్త రుగ్మతగా పేర్కొన్నారు.
    • పొట్టలోని నరాల్లో రక్తం గడ్డకట్టడం (మెసెంటెరిక్ థ్రోంబోసిస్): ప్రేగుల నుండి రక్తాన్ని ప్రవహింపజేసే ఒకటి లేదా ఎక్కువ ప్రధాన సిరల్లో రక్తం గడ్డకట్టడం మూలాన ఈ కడుపునొప్పి సంభవిస్తుంది.
    • కలరా (గాస్ట్రోఎంటరిటిస్):
    • జీవక్రియ ఆటంకాలు:
    • నరాల విచ్ఛేదనం లేదా వాపువ్యాధి
    • ప్రేగుల్లో అవరోధం
    •  మానసిక కారణాలు: ఒత్తిడి, ఆందోళన, నిరాశ, మొదలైనవి కూడా కడుపు నొప్పిని కలిగించవచ్చు. మానసిక రోగం నుండి రోగి తిరిగి కోలుకోవడంతో ఇది సాధారణంగా తనంతట తానుగా దూరమయి పోతుంది.
       
  • సూచించిన నొప్పి:
    కొన్నిసార్లు నొప్పి పుడుతున్న చోటు ఒకటైతే రోగికి ఆ నొప్పి వేరొకచోటున కలుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. దీన్నే 'సూచించిన నొప్పి' గా పేర్కొంటారు. శ్వాస సంబంధ రుగ్మతలైన న్యుమోనియా, పల్మోనరీ ఇన్ఫెక్షన్ (ఊపిరితిత్తుల సంక్రమణ) మరియు గుండె సంబంధ వ్యాధులు అయినటువంటి 'హృదయ స్నాయు రోగం' (లేదా గుండె పోటు) ఇలాంటి 'సూచించిన నొప్పి' ని కడుపు ఎగువ ప్రాంతంలో కలుగజేస్తుంది. 

మీ కడుపు నొప్పి యొక్క కారణాన్ని స్వీయ-విశ్లేషణ చేయడానికి మీరు ప్రయత్నించవద్దని మేము సలహా ఇస్తున్నాం. ఒక వైద్యుడు మాత్రమే ఖచ్చితంగా కడుపునొప్పిని నిర్ధారించగలడు. సూచించిన వైద్య పరీక్షలతో పాటు రోగిని డాక్టరు భౌతికంగా  పరీక్ష చేయడం వల్లనే కడుపు నొప్పి యొక్క మూల కారణాన్ని కనుగొనవలసి ఉంటుంది.

కడుపునొప్పి నిర్ధారణ - Diagnosis of Stomach Pain in Telugu

కడుపునొప్పికి సంబంధించి పూర్తిస్థాయి పరీక్ష మరియు రోగ నిర్ధారణ కోసం డాక్టర్ని సందర్శించమని సిఫార్సు చేస్తున్నాము. కడుపు నొప్పి ఎలా మొదలవుతుంది, కడుపు నొప్పి ఎంతసేపు ఉంటుంది, తిరిగి కడుపునొప్పి ఎప్పుడొస్తుంది, కడుపులో సరిగ్గా ఏ ప్రదేశంలో వస్తుంది, దాని తీవ్రత ఎల్లా ఉంటుంది, మరియు సంబంధిత లక్షణాలు, ఆకలి, తినే అలవాట్లు, భేది లక్షణాలు, మూత్రవిసర్జన లక్షణాలు మరియు ఋతుక్రమ చరిత్రను డాక్టరు కు వివరంగా తెలపండి. భౌతికంగా వైద్యుడు మిమ్మల్ని పరీక్ష చేసేటపుడు ఈ విషయాలను డాక్టరుకు చెప్పండి. వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా, వైద్యుడు కింది రోగ నిర్ధారణ పరీక్షలను సూచించవచ్చు. ఈ పరీక్షలలో ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, CT స్కాన్ వంటి ప్రయోగశాల పరిశోధనలు మరియు రేడియాలజిక్ పరీక్షలూ ఉన్నాయి.

ప్రయోగశాల పరిశోధనలు

  • సిబిసి (కంప్లీట్ బ్లడ్ కౌంట్): ఈ పరీక్షలో, వ్యక్తి యొక్క రక్తాన్ని తీసుకుని సేకరిస్తారు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు, హేమోగ్లోబిన్ స్థాయిలు, మొదలైనవాటిని కొలుస్తారు. ఈ పరీక్షలు అంటువ్యాధులు, క్యాన్సర్, అనీమియా వంటి రోగాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి సహాయపడుతాయి.
  • హెచ్ బి (హెమోగ్లోబిన్) అంచనా: అతిసారం (డయేరియా) మరియు వాంతులు, ఇర్రిటబల్ బౌల్ వ్యాధి వంటి ఇతర లక్షణాలతో కూడిన కడుపునొప్పికి రక్తహీనత (అనీమియా) ప్రధాన కారణం. అందువల్ల, హెమోగ్లోబిన్ అంచనాలు సాధారణ స్థాయి పరిధిలోనే ఉన్నాయా, అలా ఉంటే, ఈ కడుపునొప్పికి అనీమియా (రక్తహీనతను) అంతర్లీన కారణం కాదు గదా అని పరిగణించేందుకు వీలుంటుంది.
  • వైట్ సెల్ కౌంట్ (WCC): అధిక వైట్ సెల్ కౌంట్ జీర్ణ వ్యవస్థ యొక్క సంక్రమణకు సూచించదగినది.
  • సిరమ్ అమిలసే మరియు లిపసే పరీక్షలు: సీరం అమిలసే మరియు లిపేస్ స్థాయిలు తీవ్రమైన క్లోమపు నొప్పి (ప్యాంక్రియాటైటిస్లో) రుగ్మతలో   సామాన్యంగా పెరుగుతుంటాయి కాబట్టి నిరూపణ కోసం ఈ పరీక్షలు చేస్తారు.
  • యూరియా, సెరమ్ క్రియేటిన్, మరియు ఎలెక్ట్రోలైట్స్ పరీక్షలు: ఈ పరీక్షలు మూత్రపిండాలు సాధారణంగా పని చేస్తున్నాయా లేదా సమర్థవంతంగా వ్యర్ధాలను ఫిల్టర్ చేయగలవో లేదో అనే దాన్ని అంచనా వేస్తాయి. ఏదైనా వ్యత్యాసం ఈ పరీక్షల్లో కనిపిస్తే మూత్రపిండ వ్యాధిని సూచిస్తుంది.
  • కాలేయ పనితీరు పరీక్షలు (LFT): కోలేసైస్టిటిస్ వ్యాధి కానీ మరియు కాలేయం పనిచేయకపోవడం ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి (Liver function test) LFT చేస్తారు.
  • ECG (ఎలెక్ట్రొకార్డియోగ్రామ్) మరియు హృదయ ఎంజైమ్ల పరీక్ష: ECG అనేది గుండె యొక్క కార్యకలాపాలను నమోదుచేసే ఒక పరీక్ష. ఇంకా, గుండె వాపు లేదా క్రమం లేని హృదయ లయల్ని, ఇతర  హృదయ వ్యాధుల్ని అంచనా వేయడానికి చేయబడుతుంది. కార్డియాక్ ఎంజైమ్స్ కోసం చేసే పరీక్షలు హృదయ కండరాలకు ఏమైనా హాని జరిగిందా అని తెలుసుకునేందుకు చేస్తారు.
  • మూత్రం పరీక్ష: వైద్యుడు సూచించిన వ్యక్తి యొక్క మూత్రం తీసుకోవడం ద్వారా మూత్రం పరీక్ష జరుగుతుంది. మూత్ర మార్గము అంటువ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్ళు, గర్భం మొదలగువాటిని నిర్ధారించుకునేందుకు వైద్యుడు ఈ పరీక్షల్ని చేస్తాడు

రేడియోలాజికల్ పరీక్షలు:

కొన్నిసార్లు, ప్రయోగశాల పరిశోధనలతో వైద్యుడు రోగి పరిస్థితిని సరిగ్గా నిర్ధారించేందుకు వీలు కాకపోవచ్చు. అటువంటి సందర్భాలలో, కడుపు నొప్పి యొక్క మూల కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ రేడియోలాజికల్ పరీక్షను (ఛాతీ ఎక్స్-రే, CT స్కాన్, అల్ట్రాసౌండ్, మొదలైనవి) చేయాలని రోగికి సలహా ఇవ్వచ్చు. కడుపు నొప్పి సమయంలో సాధారణంగా కింద సూచించిన రేడియోలాజికల్ పరీక్షలు చేస్తారు.

  • ఛాతీ మరియు కడుపు ఎక్స్ రే: పేగుల్లో ఏవైనా అడ్డంకులేర్పడ్డాయా? పేగులకు రంధ్రాలు గాని అయినాయా? అని తెలుసుకోవడానికి, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, పొత్తికడుపులోని అవయవాల అసాధారణ వాపు తదితరాది ఉదర-సంబంధ అవాంతరాలను గుర్తించడానికి తరచుగా ఎక్స్-రేలు వైద్యులకు ఉపయోగకరంగా ఉంటాయి.
  • ఉదర అల్ట్రాసౌండ్ పరీక్ష: ముఖ్యముగా మూత్రపిండాల్లో రాళ్లను, కడుపులో గడ్డలను, కడుపులోని మరేవైనా అవయవాలకు గాయాలు గాని, పుండ్లు గాని అయినాయా అని గుర్తించడానికి అల్ట్రాసౌండ్ పరీక్షను వైద్యుడు చేస్తాడు. రోగికి వెల్లకిలా పడుకోమని చెప్పి, ఉదరం యొక్క పైభాగంలోని  ఏప్రాంతంలో అల్ట్రాస్కేన్ తీయాలో ఆ భాగానికి ఒక జెల్ ను రాస్తారు. తర్వాత,  జెల్ రాసిన ప్రాంతంలో స్కాన్ యంత్రాన్ని నెమ్మదిగా కదుపుతూ  తెరపై ఏ ఏ ఉదరాంతర  అవయవాలను ప్రత్యక్షచిత్రాలుగా ఉత్పత్తి చేయాలో వాటిని ఉత్పత్తి చేస్తారు. ఈ పరీక్ష గర్భధారణ-సంబంధ విషయాలను, అపెండిసిటిస్ వ్యాధి, తదితరాలను గుర్తించడానికి సహాయపడుతుంది.
  • ఇంట్రవీనస్ పైలోగ్రామ్ పరీక్ష (IVP): మూత్రపిండాల్లోని రాళ్లను మామూలు ఎక్స్-రే ద్వారా గుర్తించడం కష్టంగా ఉన్నపుడు ఈ ‘ఇంట్రవీనస్ పైలోగ్రామ్ పరీక్ష’ ను రోగికి చేస్తారు. మానవశరీరంలో మూత్రపిండాలు లోతుగా పాతుకుపోయిన అవయవాలు కాబట్టి కొన్ని సందర్భాల్లో సాధారణ ఎక్స్-రేలకు కిడ్నీరాళ్లను గుర్తించడం సాధ్యం కాదట. ‘ఇంట్రవీనస్ పైలోగ్రామ్ పరీక్ష’చేసేటపుడు సదరు వ్యక్తి యొక్క రక్తంలోకి ఒక రంగు (డై) ద్రవాన్నిఇంజెక్ట్ చేస్తారు. కొంతసేపైన తర్వాత, కొన్ని క్రమమైన వ్యవధుల్లో ఎక్స్-రేలను తీసుకుంటారు. ఇలా రంగు ద్రవాన్ని వ్యక్తి రక్తంలోకి ఇంట్రావీనస్ గా ఎక్కించడం ద్వారా  శరీరంలోని మూత్రపిండాలు మరియు మూత్రాశయంలోని విశదీకృత నిర్మాణాలను వైద్యుడు ఎక్స్-రేల ద్వారా స్పష్టంగా చూడగలుగుతాడు. తద్వారా, కిడ్నీరాళ్ళను కూడా గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది.
  • లాపరోస్కోపీ పరీక్ష: ఈ పరీక్షను ఉదర గోడల ద్వారా ఓ ‘మెడికల్ టెలెస్కోపు’ సాయంతో   వైద్యులు నిర్వహిస్తారు. ఈ వైద్య టెలిస్కోప్ ను ఉపయోగించి వైద్యులు రోగి కడుపులోని అన్నిఅవయవాలను వీక్షించగలరు. ఇంకా, స్త్రీ కటిస్థానంలోని పునరుత్పత్తి అవయవాలను కూడా ఈ టెలీస్కోప్ ద్వారా వైద్యులు చూడగలరు.
  • ఎండోస్కోప్: ఈ పరీక్ష ప్రక్రియలో జీర్ణవ్యవస్థలో ఏవైనా అసాధారణ పరిస్థితులను తనిఖీ చేయడానికి నోటి ద్వారా ఓ పరికరాన్ని జొప్పిస్తారు.
 

కడుపు నొప్పికి చికిత్స - Treatment of Stomach Pain​ in Telugu

తేలికపాటి కడుపు నొప్పి అయితే సాధారణంగా ఒక రోజు లేదా రెండురోజులుండి తర్వాత దానంతట అదే పోతుంది. సాధారణంగా మామూలు కడుపునొప్పి అయితే మనకున్న జీర్ణవ్యవస్థ ద్వారా కడుపులోని వ్యర్థాలు తొలగింపబడి మనం తిరిగి కోలుకుంటాం. అయితే దీర్ఘకాలం ఉండే కడుపు నొప్పిని  నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తీవ్రమైన సమస్య లేదని నిర్ధారించుకోవాలి. అలా కాకుండా, ఏదైనా తీవ్రమైన సమస్య గనుక ఉంటే సకాలంలో చికిత్స చేయించుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

కడుపు నొప్పి చికిత్స రోగ నిర్ధారణ మీద ఆధారపడి ఉంటుంది.

మామూలుగొచ్చే తేలికపాటి కడుపునొప్పి సాధారణంగా ఒక రోజు లేదా రెండు రోజులలో నొప్పినివారణా ముందుల ద్వారా, ఇంకా ద్రవ పదార్ధాలు (ఉదాహరణకు ORS పరిష్కారం), తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ద్వారానే నయమవుతుంది.  

మందులు

కడుపునిప్పికి నొప్పినివారణా మందులు (పెయిన్ కిల్లర్స్) కొంత వరకు ఉపశమనం కలిగిస్తాయి. అమ్లపిత్త (అసిడిటీ) దోషానికి మందుల దుకాణంలో లభించే ఆమ్లవిరోధి (యాంటాసిడ్స్) ఔషధాలు కడుపు నొప్పికి  వెంటనే ఉపశమనం ఇస్తాయి. వాంతులు తగ్గించడానికి సహాయపడే ‘యాంటీ-ఎమెటిక్’ ఔషధాలను వైద్యుడు మీకు సూచిస్తాడు. శరీరంలో ద్రవ నష్టాన్ని భర్తీ చేయడానికి డ్రిఫ్స్ ఎక్కించడం ద్వారా ఇంట్రావీనస్ ద్రవాలను, లేదా ఉప్పు-సంభమైన ఓరల్ రిహైడ్రేషన్ సాల్ట్ (ORS) ద్వారా మీ కడుపు నొప్పికి ప్రత్యామ్నాయ చికిత్స జరుగుతుంది. కడుపులో కురుపులు (సంక్రమణము) పుండు లేదా చీము ఉన్నట్లు వైద్యుడు గ్రహిస్తే యాంటీబయాటిక్స్ మందులను సూచిస్తారు.

సర్జరీ

కడుపునొప్పి  లక్షణాలు కొనసాగితే, మీ వైద్యుడు మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి ఆసుపత్రిలో మరింతకాలం చికిత్సను కొనసాగించొచ్చు, వైద్య పరిశోధనలను చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో త్వరగా మిమ్మల్ని కడుపునొప్పి నుండి రక్షించేందుకు వైద్యుడు శస్త్రచికిత్స (అవసరమైతే)నూ  చేయవచ్చు.   

స్వీయ-రక్షణ 

కడుపునొప్పితో బాధపడేటపుడు, వైద్యుడ్ని కలిసేందుకు ముందుగా నొప్పి ఉపశమనానికి  కింద తెలిపిన విధుల్ని పాటించవచ్చు.

  • పడుకోవడానికి సౌకర్యవంతమైన (position) స్థితిని (ఎటువైపున పడుకోవాలన్నది)  ఎంచుకోండి.
  • సౌకర్యంగా, వెచ్చగా ఉండేందుకు అనువుగా ఏర్పాటు చేసుకోండి. (ముఖ్యంగా ఋతు తిమ్మిరి నొప్పులు మరియు కండరాల నొప్పి ఉన్నట్లయితే)
  • సరైన విశ్రాంతి తీసుకోండి.
  • మీరు అతిసారం లేదా ఎలాంటి భేదులున్నా మామూలుగా తాగే సాదా నీరు తాగొద్దు.
  • కలుషితమైన ఆహారాన్ని తినకండి. తాగకండి. .
  • ఈ సమయంలో పాలు త్రాగటం మానుకోండి.
  • మసాలాభరితమైన మరియు భారీ ఆహారం తినడం మానుకోండి.
  • స్వల్ప పరిమాణంలో, తక్కువ సమయాంతరాల్లో తేలికైన ఆహారాన్నిసేవించండి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

కడుపునొప్పి నివారణ - Prevention of Stomach Pain​ in Telugu

రోగనయం కన్నా రోగనివారణ గొప్పది. అంటే కడుపునొప్పి వచ్చిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కన్నా కడుపునొప్పి రాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఉత్తమం. కడుపునొప్పి రాకుండా మీ పొట్టలోని ప్రేవులు రోగరహితంగా మరియు ఆరోగ్యకరమైనవిగా ఎల్లప్పుడూ ఉండేందుకు సహాయపడే కొన్నిచిట్కాలివిగో:

  • నీటిని  పుష్కలంగా తాగండి.
  • పీచు/ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినండి. మీరేదయినా వైద్య పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లైతే మంచి ఆహారప్రణాళిక కోసం ఓ పోషకాహార నిపుణుడిని సంప్రదించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.
  • చెడిపోయిన లేక వీధుల్లో అమ్మే కలుషితం అయిన ఆహారాన్ని తినడం మానండి.
  • సమతుల్య ఆహారం తీసుకోండి.
  • శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రమమైన ధ్యానం లేదా యోగా, లేదా ఏదైనా ఇతర శారీరక వ్యాయామం చేయండి.
  • మసాలాలు, అధిక కొవ్వు, జిడ్డు కల్గిన చెత్త తిండి (జంక్ ఫుడ్) ని తీసుకోవడం మానుకోండి.
  • ధూమపానం, సారాసేవనం, టీ, మరియు కాఫీ సేవనం మానుకోండి. ఒకవేళ సాధ్యం కాకపొతే, కనీసం గణనీయంగానైనా వీటి సేవనం తగ్గించండి.


వనరులు

  1. Sherman R. Abdominal Pain. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 86
  2. Fields JM, Dean AJ. Systemic causes of abdominal pain.. Emerg Med Clin North Am. 2011 May;29(2):195-210, vii. PMID: 21515176.
  3. National Health Service [Internet]. UK; Stomach ache
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Abdominal pain
  5. Healthdirect Australia. Abdominal pain. Australian government: Department of Health

కడుపునొప్పి కొరకు మందులు

Medicines listed below are available for కడుపునొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for కడుపునొప్పి

Number of tests are available for కడుపునొప్పి. We have listed commonly prescribed tests below: