ఆమ్లత (ఎసిడిటీ) - Acidity in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

January 31, 2019

September 11, 2020

ఆమ్లత
ఆమ్లత

సారాంశం

కడుపులో మంట కలిగేటువంటి పరిస్థితినే  ‘ఆమ్లపిత్తము’ లేదా ‘ఆమ్లత్వం’ అంటారు. మనిషిలో వచ్చే ఈ తొందర పరిస్థితిని చెప్పేందుకు నేటి రోజుల్లో ‘ఎసిడిటి’  (గుండెల్లో మంట/heartburn) అనే పదాన్నే వాడటం చూస్తున్నాం. తేన్పులు, గొంతులో, ఛాతీలో చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే “నాకెంటో  ‘ఎసిడిటీ’ గా ఉంది” అంటుంటారు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు. ప్రపంచవ్యాప్తంగా ఆడ, మగా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఛాతీ ప్రాంతంలో వచ్చే అతి సామాన్యమైన అనుభూతే ఈ ‘ఎసిడిటీ’ లేక ఆమ్లత్వం. ఆమ్లత్వం ప్రధానంగా ఛాతీలో మండే అనుభూతి కారణంగా గుర్తించబడింది. పొత్తికడుపు ఎగువ ప్రాంతంలో కొన్ని సార్లు ఇది చికాకు మరియు మంటను పుట్టిస్తుంది. ఆ మంటతో పాటు, తేలికపాటి నుండి ఓ మోస్తరుపాటి నొప్పి కూడా కలగొచ్చు. ఆమ్లత్వానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఏమంటే కడుపులోంచి ఆమ్లభరిత (పులుపు) ద్రవాలు ఛాతీలోని అన్నవాహిక (ఆహార గొట్టం) లోకి  తిరిగి ఎగదన్నుకుని రావడమేనని పరిశోధనలు గట్టిగా సూచిస్తున్నాయి.

ఎసిడిటీ అంటే ఏమిటి - What is Acidity​ in Telugu

ఆమ్లతకు కారణం కడుపులో జనించే ఆమ్లాలు. హైడ్రోక్లోరిక్ యాసిడ్  (కడుపు లోపల ఉత్పత్తి అవుతుంది) అనేది మన జీర్ణ వ్యవస్థలో ఓ ముఖ్యమైన భాగం. ఇది మనం తినే ఆహార పదార్ధాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది మరియు హానికరమైన బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడి మన శరీరాన్ని రక్షిస్తుంది. అయినప్పటికీ, కడుపులో ఉండే లైనింగ్ కఠినమైనది గనుక హైడ్రోక్లోరిక్ ఆమ్ల చర్యను నిరోధించవచ్చు. కానీ దీనికి విరుద్ధంగా, అన్నవాహిక (ఫుడ్ పైప్ లేక ఎసోఫాగస్) లోపల ఉండే లైనింగ్ సాపేక్షంగా చాలా మృదువుగా ఉంటుంది, మరి ఇది క్షయకారి అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క చర్యను ప్రభావవంతంగా అడ్డుకోలేదు గనుక ఆ విధంగా ఛాతీలో మండే అనుభూతిని మనకు కల్గిస్తుంది. కడుపులో జనించే ఆమ్లాలు మళ్ళీ మళ్ళీ ఇలా అన్నవాహికలోనికొచ్చి ఛాతీని, గొంతును  మండించడాన్ని ‘గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (GERD) అంటారు.

 

ఆమ్లత్వం యొక్క లక్షణాలు - Symptoms of Acidity​ in Telugu

 ఆమ్లత ఉన్నప్పుడు ఏయే లక్షణాలను గమనించవచ్చు 

 • ఛాతీలో మండే అనుభూతి- కడుపులో జనించే ఆమ్లాలు మళ్ళీ మళ్ళీ అన్నవాహికలోనికొచ్చి గొంతును మండించడం జరుగుతుంది, ఇంకా, పడుకున్నప్పుడు లేదా కిందికి వంగినప్పుడు ఇది మరింత విపరీతమవుతుంది. ఈ ఆమ్లత్వం కొన్ని గంటలపాటు నిరంతరంగా రావచ్చు. ఇంకా, భోజనం తిన్న తర్వాత  మరింత తీవ్రమవుతుంది.
 • ఇలా ఆమ్లాలు పలుమార్లు అన్నవాహికలోనికొచ్చి గొంతులో మంటే గాక, గొంతులో నొప్పిని, మెడలో నొప్పిని కల్గించవచ్చు.
 • పుల్లని రుచితో కూడిన ‘పుల్ల త్రేన్పులు’ మీకు ఎక్కువగా రావచ్చు.
 • తరచుగా వికారం (వాంతి భ్రాంతి) కలగొచ్చు. బహుశా వాంతి కూడా అవొచ్చు.
 • భుక్తాయాసంగా ఉన్నట్లు లేదా కడుపుబ్బరించినట్లు అనిపించవచ్చు
 • మీరు నిరంతరమైన పొడి దగ్గును కల్గి ఉంటారు.
 • శ్వాసలో గురక లాంటి శబ్దం, ఈ లోపం చాలా సాధారణం
 • గొంతు గీచుకుపోవడం వంటి చిన్నపాటి గొంతు సమస్యలుంటాయి.
 • ఎక్కువ కాలం గొంతు నొప్పి
 • మీకు మింగడం కష్టంగా ఉంటుంది, దానితో పాటు గొంతులో నొప్పి కూడా అనుభవించవచ్చు
 • ఛాతీలోనొప్పి మరియు పొత్తికడుపు ఎగువన నొప్పిని కలిగి వుంటారు.   
 • అన్నవాహికలోంచి పలుమార్లు వచ్చే ‘పుల్లని త్రేన్పులు (యాసిడ్ రిఫ్లక్స్) మీ పంటి ఎనామెల్ కు నష్టం కలిగించవచ్చు
 • ఆమ్లత్వం వల్ల కొందరిలో అసహ్యకరమైన శ్వాస మరియు దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది.   
 • మీ మలంలో కొంత రక్తం పడడం గమనించవచ్చు లేదా అది మలం సాధారణమైనదిగా కాకుండా నలుపు రంగుకు మారచ్చు.
 • కొన్నిసార్లు ఎడతెరపి లేని ఎక్కిళ్ళు రావచ్చు.  
 • ఏ స్పష్టమైన కారణం లేకుండా మీరు బరువు తగ్గిపోవడం గమనించొచ్చు.

 ఆమ్లత్వం (ఎసిడిటి) వచ్చినపుడు డాక్టర్ని ఎప్పుడు కలవాలి

మీరు ఆమ్లతతో ఉన్నపుడు క్రింది లక్షణాలను కలిగి ఉంటే డాక్టర్ను సంప్రదించండి. :

 • మీరు తరచూ గుండె మంట, ఛాతీలో మంటతో కూడిన ఆమ్లత్వాన్ని ఎదుర్కొంటుంటే.
 • మీరు మింగటానికి కష్టపడుతుంటే, ముఖ్యంగా ఘనపదార్థాలను మింగేప్పుడు మిక్కిలి కష్టపడి మింగాల్సి వచ్చినపుడు.
 • తెలియని కారణాల వలన గణనీయమైన మరియు త్వరిత శరీర బరువు నష్టం ఉంటే.
 • మీరు శ్వాసకోశ-సంబంధ సమస్యల (ఊపిరి పీల్చుకోవడం కష్టమవడం) తోను మరియు దీర్ఘకాలం దగ్గుతో బాధపడుతున్నట్లయితే
 • మీరు ఇప్పటికే యాంటీ-యాసిడ్ ఔషధాలను 15 రోజులకు పైగా వాడుతున్నా ఎటువంటి ఉపశమనం లేకుండా ఉంటే .
 • గొంతు రాసుకునిపోయి ఉంటే, ఉబ్బసం మరియు ఆందోళనలతో మీరున్నట్లైన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి
 • మీరు ఆమ్లత్వం కారణంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే
 • మీరు దవడ, మెడ మరియు నోటి కుహరం (నోటి లోపల) లో నొప్పితో పాటు ఛాతీ నొప్పిని ఎదుర్కొంటుంటే
 • మీ నాడి సక్రమంగా కొట్టుకోకపోయినా (అదుపు తప్పిన నాడి), శ్వాస లో కష్టం, బలహీనత మరియు అధిక చెమటోడడమున్నా.
 • మీరు అధిక కడుపు నొప్పిని ఎదుర్కొంటుంటే.
 • మీకు విరేచనాలవుతుంటే, మలంలో రక్తం పడుతున్నా, లేక మలంలో నల్లని చారలేర్పడి వస్తున్నా

ఆమ్లత్వానికి కారణాలు మరియు (సమస్యలు) ప్రమాదకారకాలు - Acidity Causes & Risk Factors​ in Telugu

ఆమ్లత్వం ఎందుకు వస్తుంది?

 • వయస్సుతో సంబంధం లేకుండా పురుషులు మరియు స్త్రీలలో ఆమ్లత్వం చాలా సాధారణం. ఆమ్లత్వం (ఎసిడిటి) ఏదో ఒక సమయంలో మనలో ప్రతి ఒక్కరికి వచ్చేవుంటుంది. మరియు ఆమ్లత్వం మనము తినే ఆహార స్వభావంతో నేరుగా ముడిపడి ఉంది.

 • గర్భాశయంలో పెరుగుతున్న పిండం వలన అంతర్గత అవయవాలపై ఒత్తిడి పెరుగుతుండటం వలన చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో ఆమ్లత్వాన్ని అనుభవిస్తారని పరిశోధనలు తెలుపుతున్నాయి. గర్భధారణ సమయంలో అతిగా తినడం వల్ల కూడా ఆమ్లత్వం ఏర్పడుతుందని పరిశోధన తేల్చింది.

 • నూనెలో వేయించిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తింటున్నా పుల్లని త్రేన్పులు (ఆమ్లత్వం) వచ్చే అవకాశాలను పెంచుతుందని పరిశోధనల్లో గమనించబడింది. వేయించిన వస్తువులు జీర్ణం కావడానికి చాలా సమయాన్ని తీసుకుంటాయి, ఎందుకంటే వేయించిన పదార్థాలు చాలా నెమ్మదిగా పేగులో ప్రవేశించడం వల్ల ఆమ్లత్వానికి కారణమయ్యే ఆమ్ల స్రావాల విడుదలకు దారితీసే అవకాశం చాలా  హెచ్చు.

ఆమ్లత్వానికి గల ఇతర కారణాలు

 • మీరు అధిక బరువును కలిగివున్నా లేదా ఊబకాయులై ఉంటే  
 • మీకు ధూమపానం అలవాటుంటే
 • నిష్క్రియ ధూమపానం (అంటే పొగ తాగే వారి పక్కనుండడం)  కూడా ఆమ్లతను కలిగిస్తుంది. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించేదిగా ఉండచ్చు, కానీ ఇది నిజం.  
 • మీరు అవసరమైనదాని కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటుంటే.
 • మీరు తక్కువ పీచు (ఫైబర్) ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే.  
 • మీరు తగినంత శారీరక శ్రమ మరియు వ్యాయామం చేయకపోతే
 • మీరు యాంటిడిప్రెసెంట్స్, మత్తుమందులు, పెయిన్-కిల్లర్లు, బ్రోన్కోడైలేటర్స్ (ఆస్తమా కొరకు ఉపయోగించే మందులు) వంటి కొన్ని మందులను తీసుకుంటూ ఉంటే గనుక.
 • మీరు ఆహారంగా లోనికి తీసుకునే పదార్థాలలో మద్యం మరియు కెఫిన్ అధికంగా ఉంటే.
 • మీరు భారీగా తినేవాళ్లయినా లేదా నిద్రపోయే ముందు తినడం మూలంగానూ జీర్ణక్రియకు ఆటంకం కలిగి, ఆమ్లతను కలిగించవచ్చు.

ఆమ్లత్వం నివారణ - Prevention of Acidity​ in Telugu

ఆమ్లతను మీరెలా నిరోధించవచ్చు?

మనం తినే ఆహారపదార్ధాలలో మార్పులను చేయడం మరియు ఆమ్లత్వానికి దోహదం చేసే కొన్ని రకాల ఆహార పదార్థాలను వినియోగించకుండా ఉండడం ద్వారా ఆమ్లతను సమర్థవంతంగా నిరోధించవచ్చు.

కింద తెలిపిన ఆమ్లత్వనివారణా మార్గాలను గమనించండి

 • మీరు అరటి, బొప్పాయి వంటి పండ్లు, వోట్మీల్ మరియు కూరగాయలను తినడం మంచిది. ఎందుకంటే ఇవి ప్రకృతిసిద్ధంగా ఆమ్లాలు ఎక్కువగా లేనివి. మరింత సమాచారం కోసం "ఏమి తినాలి" అనే సెక్షన్ లో చదవండి.
 • మీరు రోజుకు 3 భోజనాలకు బదులుగా వీలైనన్ని ఎక్కువసార్లు తక్కువ  తక్కువ పరిమాణంలో “చిన్న భోజనాలు” తినడం మంచిది.
 • మీరు నిద్రపోయేందుకు కనీసం 1-2 గంటలు ముందుగా భోజనం చేయాలి.
 • మీరు ఆరోగ్యకరమైన బరువును కల్గి ఉండేట్లు చూసుకోవాలి.  
 • రోజువారీ కనీసం 3 లీటర్ల నీటిని మీరు తాగాలి.
 • భోజనానికి 30 నిమిషాల ముందు మరియు భోజనానికి 1 గంట తర్వాత నీళ్ళు త్రాగకూడదని మీకు సిఫారసు చేయడమైనది.
 • టైటు బెల్టులు మరియు చాలా బిగుతుగా (టైట్-ఫిట్టింగ్) ఉండే దుస్తులను ధరించకూడదని మీకు సిఫార్సు చేయడమైనది.

ఆమ్లత్వం (ఎసిడిటి) నిర్ధారణ - Diagnosis of Acidity​ in Telugu

ఆమ్లతను ఎలా నిర్ధారణ చేయాలి?

యాంటాసిడ్ మందుల సాధారణ వినియోగం మరియు సంబంధించిన చికిత్సల తర్వాత కూడా ఎలాంటి ఉపశమనం లభించనప్పుడు కడుపులో ఆమ్లత్వం ఉనికి కోసం  వైద్య పరిశోధనలు మరియు అసిడిటీ రోగ నిర్ధారణ ప్రారంభం కావాలి. ఆమ్లత్వం యొక్క గుర్తింపు మరియు చికిత్స అనేది సంక్లిష్టమైన ప్రక్రియ కానే కాదు, వాస్తవానికి ఇది సులభంగా గుర్తించదగినది మరియు నయం చేయబడుతుంది కూడా. కానీ ఎన్నో సార్లు ఆమ్లత్వం యొక్క లక్షణాలు న్యుమోనియా, గుండెపోటు మరియు ఛాతీ సంబంధిత రుగ్మతల రోగ లక్షణాలను పోలి ఉంటాయి. అందువల్ల ఆమ్లత్వం (అసిడిటీ) ఉన్నవారు చాలా మంది తరచూ ఆందోళన చెందుతూ తక్షణ వైద్య చికిత్సను కోరుకుంటూ ఉంటారు.

ఆమ్లతను గుర్తించే పరీక్షలు కింది విధంగా ఉన్నాయి

 • ఎండోస్కోపీ
   ముఖ కుహరం (నోరు, ఎసోఫాగస్) జీర్ణాశయాంతర ప్రేగు మరియు కడుపు వంటి అంతర్గత శరీర భాగాలను తనిఖీ చేయడానికి క్లినికల్ కెమెరా ను ఉపయోగిస్తారు.

 • జీవాణుపరీక్ష (బయాప్సి)
   కణజాలాన్ని (టిష్యూ) మాలిన్యరహితంగా సేకరిస్తారు. అటుపై దాన్ని ప్రయోగశాలలో సూక్ష్మదర్శినిలో పరీక్షిస్తారు.

 • బేరియం ఎక్స్-రే 
  జీర్ణాశయ సంబంధమైన ‘గ్యాస్ట్రోఇంటెస్టినాల్’ (జిఐ) యొక్క చిత్రాలను సంగ్రహించడానికి ఉపయోగించే ఒక ఇమేజింగ్ టెక్నిక్ ఈ బేరియం ఎక్స్-రే

 • ఎసోఫాగియల్ మ్యానోమెట్రీ
   అన్నవాహిక పైని ఒత్తిడిని కొలిచే ఒక పద్ధతి.

 • ఇంపెడెన్స్ పర్యవేక్షణ 
  కడుపులో ఉత్పత్తి చేయబడిన ఆమ్ల రేటును పర్యవేక్షించే ఒక పద్ధతి.

 • pH పర్యవేక్షణ
  కడుపులోంచి అన్నవాహిక (ఎసోఫాగస్) లోకి ప్రవేశించే ఆమ్లపరిమాణాన్ని కొలుస్తారు.

ఆమ్లత్వానికి (ఎసిడిటీ) చికిత్స - Treatment of Acidity​ in Telugu

ఆమ్లత్వం యొక్క చికిత్స అస్సలు సంక్లిష్ట ప్రక్రియ కానే కాదు. చాలా తక్కువ కేసుల్లో మాత్రమే శస్త్రచికిత్స అవసరం ఉంటుంది. ఆమ్లత్వ చికిత్స ప్రధానంగా ఆహార అలవాట్లలో మార్పులు, జీవనశైలి మార్పులు మరియు ఎసోఫాగియల్ నష్టాల (ఏదైనా ఉంటే) యొక్క మరమ్మత్తుపై దృష్టి పెడుతుంది.

మందులు 

 • అంటాసిడ్లు- మీకు సమీపంలోని ఏ మందుల దుకాణంలోనైనా అంటాసిడ్లు సాధారణంగా అందుబాటులో ఉంటాయి.  కడుపులో అధిక ఆమ్ల ఉత్పత్తిని అణచివేయడం మరియు కడుపులోంచి ఆమ్లం మాటి మాటికీ గొంతులోకి రావడమనే దాన్ని నివారించడంలో అంటాసిడ్లు చాలా బాగా పని చేస్తాయి.
 • ఆమ్లాలను (యాసిడ్ లు) -అణిచివేసే మందులు- ఆమ్ల ఉత్పత్తిని కడుపులో తగ్గించడానికి ప్రధానంగా రెండు రకాలైన మందులు సూచించబడ్డాయి. a) ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు b) హిస్టామిన్ 2 రిసెప్టర్ ఇన్హిబిటార్స్. ఈ మందులు ఎసోఫాగస్ లైనింగ్ మరమత్తు మరియు అధిక యాసిడ్ ఉత్పత్తిని నివారించడంలో సహాయపడతాయి.

 • ప్రోకినెటిక్ (Prokinetic) ఏజెంట్లు - ఈ మందులు ఆహార పైప్ లేక అన్నవాహిక మరియు కడుపు దారిలో మిగిలుండే ఆహార కణాలు మరియు ఆమ్లాలను కిందికి (అంటే జీర్ణవ్యవస్థలోకి) ప్రవహింపచేయడంలో సహాయం చేస్తాయి.   కాబట్టి కడుపులోంచి ఆమ్లం మళ్ళీ మళ్ళీ గొంతులోకి (రిఫ్లక్స్) వచ్చే అవకాశం తక్కువ లేదా అలాంటి అవకాశాలు ఉండవు.

 • శ్లేష్మ సంరక్షక ఏజెంట్లు -ఈ మందులు అన్నవాహికలో (ఎసోఫేగస్) ఉండే శ్లేష్మత్వచము లేక శ్లేష్మ పొరను రక్షించడంలో సహాయపడతాయి. కడుపులోంచి ఆమ్లం మళ్ళీ మళ్ళీ అన్నవాహిక, గొంతులోకి ప్రవేశించడం కారణంగా శ్లేష్మ పొరను తాకి తద్వారా కలిగే మంటను నివారించడంలో ఈ మందులు చాలా బాగా పనికొస్తాయి.

సర్జరీ

ఎప్పుడు శస్త్రచికిత్స అవసరం?

 • ఆమ్లత్వ నివారణ కోసం దీర్ఘకాలంపాటు ఔషధాలను సేవించినా కూడా అసిడిటీ యొక్క లక్షణాలు ఏమాత్రం తగ్గకుండా ఉన్నపుడు శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు.  కొన్నిసార్లు దీర్ఘకాలంపాటు మందులు సేవించడం మూలంగా అవాంఛిత దుష్ప్రభావాలు (side effects) కలిగినపుడు.
 • సుదీర్ఘకాలం మందులు తీసుకోకూడదని ఎవరైతే కోరుకుంటారో అలాంటివారికి శస్త్రచికిత్స అనేది ఒక పరిష్కారమే మరి.

శస్త్రచికిత్స సహాయంతో గొంతులోని సంకోచక కండరము (స్పిన్స్టర్, ఎసోఫాగస్లో వాల్వ్) యొక్క పరిమాణం మరియు పీడనాన్ని క్రమబద్దీకరించడం ద్వారా అసిడిటీ కి మంచి పరిష్కారం లభిస్తుంది. ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి కూడా ఈ శస్త్రచికిత్స ఉపయోగకరంగా ఉంటుంది.

జీవనవిధానంలో (లైఫ్స్టయిల్) మార్పులు

ఆమ్లత్వాన్ని సమర్థమంతంగా ఎదుర్కోవాలంటే తినే ఆహారంలో మార్పులే  కాకుండా, జీవనశైలిలో కూడా మార్పులు చాలా అవసరం.

 • సమయానికి మందులు (యాంటీ-ఆమ్లాలు) తీసుకోవడం: అంటే భోజనానికి కనీసం 30-60 నిమిషాలు ముందు ఈ మందులు తీసుకోవాలి. తినే ముందు ఉదరంలో అధిక ఆమ్ల ఉత్పత్తిని అణచివేయడం ఈ మందుల పని.
 • చూయింగ్ గమ్ నమలడం (పిప్పరమింట్ రుచిని కల్గిన వాటిని నమలకండి.)
 • పడుకోవడానికి కనీసం 2 లేక 3 గంటలు ముందుగా రాత్రి భోజనం (డిన్నర్) చేయండి.
 • తిన్న తర్వాత కనీసం 2 గంటలు పడుకోకండి.
 • మితం మించి తినకండి.
 • కడుపులోంచి ఆమ్లం మళ్ళీ మళ్ళీ గొంతులోకి (రిఫ్లక్స్) రావడాన్ని (యాసిడ్ రిఫ్లక్స్) తగ్గించడానికి, ఎక్కువ మారిమాణంలో ఉండే భోజనాన్ని రోజుకు 3 సార్లు తినే కంటే చిన్న భోజనాలను (అంటే తక్కువ పరిమాణంలో) ఎక్కువసార్లు తినండి.
 • నిద్రిస్తున్నప్పుడు మీ తల (మీ పాదాలకంటే ఎత్తులో) కింద దిండు ఉంచుకుని నిద్రించండి. దీనివల్ల కడుపులోంచి పలుమార్లు ఆమ్లం గొంతులోకి (ఆమ్లం రిఫ్లక్స్) రావడం తగ్గిపోతుంది.
 • శారీరక శ్రమ కోసం, వాకింగ్, జాగింగ్, యోగ, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాదులను రోజులో కనీసం 30 నిమిషాలపాటు చేయండి.

మీకు ఆమ్లత్వం (ఎసిడిటీ) ఉంటే ఏమి తినకూడదో తెలుసుకోండి - What to avoid if you have Acidity​ in Telugu

మీకు ఆమ్లత్వం (ఎసిడిటీ) ఉంటే ఏమి తినకూడదో తెలుసుకోండి 

 • ఖాళీ కడుపున ఎండు పండ్ల మిశ్రమం మరియు వాల్నట్ (walnuts) లను తినవద్దు
 • శుద్ధి చేయబడిన చక్కెర, ఆ చక్కెరతో చేసిన పదార్థాలు,  మరియు తేనెను తినొద్దు.
 • కొన్ని సుగంధ ద్రవ్యాలైన, మిరియాలు, దాల్చినచెక్క, పచ్చి మిరపకాయలు మరియు వెనిగర్ లను ఆమ్లాత్వమున్నపుడు తినకండి.
 • మద్యం
 • టీ మరియు కాఫీ (ఈ పానీయాల్లో కెఫిన్ అధికంగా ఉంటుంది )
 • ఆమ్లం అధికంగా ఉండే నిమ్మ మరియు నారింజ వంటి (యాసిడ్ పండ్లు) పండ్లను తినకండి.

మీరు ఆమ్లత్వంతో (ఎసిడిటీ) ఉంటే ఏమి తినాలి - What to eat if you have Acidity

 • కూరగాయలు 
  కూరగాయలు సహజంగా చాలా తక్కువ చక్కెర మరియు ఆమ్లాలను (యాసిడ్) కలిగి ఉంటాయి. అందువల్ల, ఫ్రెంచ్ బీన్స్, బ్రోకలీ, క్యాబేజీ, బంగాళాదుంపలు మరియు దోసకాయలు వంటి కొన్ని కూరగాయలను సురక్షితంగా  తినొచ్చు. కూరగాయలు ఆమ్లతను తగ్గించడంలో సహాయపడగలవని పరిశోధకులు సూచిస్తున్నారు.

 • అల్లం 
  అల్లం ఆమ్ల-విరోధి లక్షణాన్ని మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ (మండే తత్వానికి విరుగుడు)  లక్షణాన్నీ పుష్కలంగా కలిగి ఉంది. అందువల్ల మనం నిత్యం తినే ఆహార పదార్థాలకు అల్లం జోడించడం మంచిది. అల్లం తినడంవల్ల శరీరంలో ఆమ్ల పరిస్థితులను తగ్గిస్తుంది.

 • వోట్మీల్
  వోట్మీల్ పీచును (ఫైబర్) సమృద్ధిగా కలిగి ఉంటుంది. బరువు మరియు ఆమ్లత్వాన్ని తగ్గించడంలో వోట్మీల్ సహాయపడుతుంది. అందువల్ల ఆమ్లత సమస్యలతో బాధపడుతున్నవారు వోట్మీల్ తీసుకోవడం చాలా మంచిది.  

 • ఆమ్లం లేని పండ్లు
   అరటి, బొప్పాయి, యాపిల్స్, బేరి మరియు దోస (మస్క్ మెల్లోన్) వంటి ఆమ్లాల శాతం తక్కువగా ఉండే పండ్లను ఆమ్లత ఉన్నవారు సురక్షితంగా తినొచ్చు.

 • గుడ్డులో తెల్లసొన (ఎగ్ వైట్) 
  గుడ్డులో తెల్లటి భాగం ప్రోటీన్లను అధికంగా కలిగి ఉంటుంది. గుడ్డులోని పసుపు భాగం తినకండి, ఎందుకంటే ఇది ఆమ్లత్వం విరుద్దంగా పోరాడ్డంలో సహాయం చేయదు.

 • నూనెలు మరియు గింజలు 
  వంటలో అవసరమైన నూనెలు మరియు విత్తనాలు బాగా తినవచ్చు. చియా గింజలు, ఆలివ్ నూనె, పొద్దుతిరుగుడుగింజల నూనె వంటివి ఆమ్లత్వాన్ని తగ్గించడంలో దోహదం చేస్తాయి.వనరులు

 1. National Health Service [Internet]. UK; Heartburn and acid reflux.
 2. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Acid Reflux (GER & GERD) in Adults.
 3. Frederik Hvid-Jensen, Rikke B Nielsen, Lars Pedersen, Peter Funch-Jensen, Asbjørn Mohr Drewes, Finn B Larsen, Reimar W Thomsen. Lifestyle factors among proton pump inhibitor users and nonusers: a cross-sectional study in a population-based setting. Clin Epidemiol. 2013; 5: 493–499.PMID: 24348070
 4. Lauren B. Gerson. Treatment of Gastroesophageal Reflux Disease During Pregnancy. Gastroenterol Hepatol (N Y). 2012 Nov; 8(11): 763–764.
 5. Health Harvard Publishing, Published: April, 2011. Harvard Medical School [Internet]. Proton-pump inhibitors. Harvard University, Cambridge, Massachusetts.

ఆమ్లత (ఎసిడిటీ) కొరకు మందులు

ఆమ్లత (ఎసిడిటీ) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।