గర్భధారణ సమయంలో సంభోగం జరపడం గురించి దంపతులు తరచుగా అయోమయం చెందుతుంటారు. గర్భవతిగా ఉన్నపుడు సంభోగం జరపడం పిండానికి హాని కలిగించవచ్చు లేదా సాధారణంగా అసౌకర్యకరమైన ప్రక్రియ కావచ్చునని వారు భయపడుతుంటారు. గర్భధారణ, తదనంతరం శిశువుకు జన్మనివ్వడం అనేవి మహిళను ఉక్కిరి బిక్కిరి చేసే అనుభూతితో కూడిన అనుభవాలే. గర్భధారణ సమయంలో ఆమె తరచుగా లెక్కలేనన్ని శారీరక మరియు భావోద్వేగ మార్పులకు గురవుతుంది. ఈ అనుభవావల్ల ఆమె పలు మానసిక కల్లోలాలను మరియు భావోద్వేగ మార్పులను ఎదుర్కొంటూ ఉంటుంది. కనుక ఇలాంటి సమయంలోనే ఆమెకు భర్త యొక్క శారీరక సాన్నిహిత్యం మరియు మానసిక అన్యోన్యత ఉపశమనాన్ని కలిగిస్తుంది. భర్త మద్దతువల్ల ఆమె ఎదుర్కొనే శారీరక, మానసిక ఒత్తిడి నుండి బయటపడి మరింత భరోసాను మరియు సురక్షితమైన అనుభూతిని పొందుతుంది. కాని, గర్భధారణ సమయంలో సంభోగించడం సురక్షితమా కాదా అనే మీమాంసకు ఈ వ్యాసంలో జవాబు ఇవ్వబడింది. కాబట్టి, మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 1. గర్భధారణ సమయంలో సంభోగించడం సురక్షితమేనా? - Is it safe to have sex during pregnancy in Telugu
 2. గర్భధారణ సమయంలో సంభోగం యొక్క ప్రయోజనాలు - Benefits of sex during pregnancy in Telugu
 3. గర్భధారణలో తక్కువ లైంగిక వాంఛ - Low libido during pregnancy in Telugu
 4. గర్భధారణ సమయంలో లైంగిక సంక్రమిత వ్యాధులు - STDs during pregnancy in Telugu
 5. గర్భధారణలో సంభోగం ఎలా జరపాలి - How to have sex during pregnancy in Telugu
 6. గర్భధారణలో సంభోగిస్తే సంభవించే ప్రమాదాలు - Risks of sex during pregnancy in Telugu
 7. గర్భధారణ సమయంలో సంభోగంవల్ల వచ్చే చిక్కులు - Complications of sex during pregnancy in Telugu
 8. ఉపసంహారం - Takeaway in Telugu

అవును, గర్భధారణ సమయంలో సంభోగించడం సాధారణంగా సురక్షితమే. గర్భధారణ తోలి దశల్లో జంటలు తరచూ మామూలుగానే సంభోగం సాగిస్తారు, కానీ గర్భం పెరిగేకొద్దీ సంభోగం యొక్క తరచుదనం లేక మరల మరల చెయ్యడమనేది (పౌనఃపున్యం లేక frequency) తగ్గిపోతుంది. గర్భం పెరిగే కొద్దీ దంపతులు ఇలా తరచూ సంభోగం చేయడాన్ని తగ్గించేయడానికి కారణం ఏమంటే వారిలో గర్భంలో పెరుగుతున్న పిండం భద్రత గురించిన భయాందోళనే. పిండానికి హానిని నివారించడానికే దంపతులు సంభోగం చేయడాన్ని తగ్గించివేస్తుంటారని చెప్పవచ్చు.

మీ పిండం మీ గర్భాశయంలో సురక్షితంగా ఉంటుంది, గర్భాశయం యొక్క మందపాటి గోడల మధ్య శిశువు ఎల్లప్పుడూ బాగా రక్షించబడుతూ ఉంటుంది. గర్భాశయం గోడలు పిండానికి హానిని నిరోధించి కాపాడుతాయి. గర్భధారణ సమయంలో సంభోగం జరిపేటపుడు  యోని, భాగాంకురం (clitoris) మరియు చనుమొనల ఉద్దీపన కారణంగా తేలికపాటి సంకోచాలు (contractions) కలుగుతాయి. ఈ సంకోచాలు ఎక్కువగా యోని మరియు స్త్రీ పునరుత్పాదక వ్యవస్థ యొక్క దిగువ భాగాలలో మాత్రమే అనుభవించబడతాయి.

భావప్రాప్తితో (orgasmic) కూడిన అనుభవం గర్భాశయంలో కూడా సంకోచాలని, కుదింపుల్ని కలిగించొచ్చు. మీరు ఈ సంకోచాలను అనుభవిస్తున్నప్పుడు శిశువు కొంచెం కొంచెంగా గర్భంలోపల కదులుతోందని మీకు అనిపించొచ్చు. అయినా ఇదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదు, ఎందుకంటే గర్భాశయం యొక్క ఎండోమెట్రియాల్ గోడల మధ్య శిశువు బాగా రక్షింపబడుతూ ఉంటుంది గనుక ఆందోళన పడాల్సిన  పని లేదు.

కొందరు గర్భిణీ  స్త్రీలకు, సంభోగంలో పాల్గొనడమంటే మరింత ఆనందదాయకం ఎందుకంటే ఛాతీ, యోని మరియు ఇతర అవయవాలు తరచుగా గర్భధారణ సమయంలో ఎక్కువ సున్నితమైనవిగా ఉంటాయి. ఈ గర్భధారణ దశలో ఈ అవయవాల యొక్క మెరుగైన రక్త ప్రసరణ మరియు ఎక్కువైన స్రావాల కారణంగానే జననేంద్రియాది అవయవాలు అధిక సున్నితత్వాన్ని కల్గి ఉంటాయి.

గర్భధారణ సమయంలో సురక్షితను పాటించడంతో పాటుగా సంభోగం జరపడంవల్ల కొందరు దంపతులకు ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణ గర్భధారణలో, ప్రసవానికి దగ్గరవుతున్న కొన్ని వారాల సమయంలో సంభోగంలో పాల్గొనడంవల్ల మహిళ యొక్క శరీరం రానున్న ప్రసవానికి సిద్ధం అవుతుంది. చాలామంది స్త్రీలు ప్రసవ సమయంలో తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటారు.

ప్రసవసమయంలో వచ్చే పురిటినొప్పులు గర్భాశయంలో కలిగే తీవ్రమైన సంకోచాలవల్ల కలుగుతాయి. ఈ పురిటినొప్పులు గర్భాశయంపైన తీవ్రమైన ఒత్తిడిని కలుగజేసి నొప్పిని మరింత తీవ్రతరం చేయడం జరుగుతుంది. ప్రసవ సమయంలో పొత్తి కడుపు, గజ్జ, వెనుక మరియు తొడల్లోనూ స్త్రీలు అమితమైన నొప్పిని, తిమ్మిరితో కూడిన బాధను  అనుభవిస్తారు.

గర్భాధారణలో సంభోగంవల్ల ఒకవైపు గర్భవతి శరీరం ప్రసవానికి సమాయత్తమవుతుంది, మరోవైపు ప్రసవసమయంలో కాబోయే తల్లి అనుభవించే పురిటినొప్పుల తీవ్రతను కూడా తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, పురిటి నొప్పుల్ని ప్రేరేపించడంలో గర్భధారణ సంభోగం సహాయపడుతుంది. కాబట్టి, ఆలస్యంగా ప్రసవం అవుతాయని నిర్ణయించబడ్డ గర్భధారణల (post-term pregnancies) విషయంలో గర్భధారణలో సంభోగాన్ని పురిటినొప్పులు ప్రేరేపణకు ఓ సహజ మార్గంగా సిఫారసు చేయబడుతుంది.

లైంగిక సంపర్క చర్యలో జననేంద్రియ మరియు చనుమొన ఉద్దీపన కారణంగా ఆక్సిటోసిన్ విడుదలవుంటుంది, ఇది వీర్యము నుండి పొందిన ప్రొస్టాగ్లాండిన్ల తో పాటు కలిసి గర్భాశయద్వారంతో పాటు గర్భాశయప్రాంతం పండేందుకు (మెత్తగా కావడానికి)  దారితీస్తుంది. ఇది గర్భవతి ప్రసవానికి అనుకూలమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది.

కొంతమంది మహిళలకు గర్భధారణ సమయంలో సంభోగాన్ని పొందాలన్న కోరిక ఏమాత్రం ఉండదు. గర్భం ధరించిన  ప్రారంభ దశలలో స్త్రీలు వికారం, వాంతులు మరియు ఇతర అనారోగ్యాలకు గురవుతుంటారు, గర్భవతుల్లో తక్కువ సంభోగవాంఛకు ఇలాంటి చిన్న చిన్న రుగ్మతలు కారణం కావచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం ఆమె యొక్క జీవితభాగస్వామికి చాలా ముఖ్యం. సంభోగంలో పాల్గొనాలా వద్దా అనేది పూర్తిగా ఆ జంటకు సంబంధించిన నిర్ణయం. కొంతమంది స్త్రీలు మరియు పురుషులు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు సంభోగించడం అనేది నైతికంగా తప్పు అని అనుకుంటుంటారు.  అలాంటి జంటలు వైద్యుడిని సంప్రదించి ఈ సమస్యలను చర్చించవలసి వుంటుంది ఎందుకంటే ఇది వారి యొక్క లైంగిక జీవితాన్ని భవిష్యత్తులో దెబ్బ తీసే అవకాశం ఉంది కాబట్టి.

గర్భధారణ సమయంలో, అనేకమంది మహిళలు తమలో వస్తున్న శారీరక మార్పుల గురించి మరియు పెరుగుతున్న కడుపు (గర్భం) గురించి జాగరూకులవుతుంటారు. ఈ కారణాల వల్లనే, గర్భవతులైన కొంతమంది మహిళలు సంభోగానికి ఇష్టపడరు, సంభోగాన్ని తప్పించుకుంటూ ఉంటారు. ఈ దశలో జీవిత భాగస్వాములైన మగవారు మహిళల ఆందోళనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జీవిత భాగస్వాములిరువురూ ఒకరినొకరు అన్యోన్యంగా చర్చించుకుని, కలిసి సంతోషంగా కాలం గడపడం ఈ సమస్యను పరిష్కరిస్తుంది, అంతే గాక ఇలా పతి-పత్నులిరువురూ అన్యోన్యంగా గడపడమనేది వారి  లైంగిక జీవితానికి కూడా సహాయపడవచ్చు. ఈ కీలకమైన (గర్భధారణ) సమయములో స్త్రీ పట్ల భర్త సానుభూతి కలిగి ఉండటం చాలా ముఖ్యం.

(మరింతసమాచారం: లైంగికవాంఛను పెంచే ఆహారాలు)

ఎలాంటి గర్భ-సంబంధ సమస్యలు లేని గర్భవతి ఒక భాగస్వామితో మాత్రమే సంభోగం జరపడం సురక్షితమని భావింపబడుతుంది, అయితే అదే గర్భవతి లైంగిక చరిత్ర తెలియని మరొక వ్యక్తితో సంభోగం జరపడం కూడదు, ఈ విషయాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఒకవేళ అలా లైంగికచరిత్ర తెలియనివ్యక్తితో గర్భవతిగ సంభోగం జరపడమంటే ఆమె లైంగిక అంటువ్యాధుల (ఎస్.టి. డి.ల) బారిన పడే ప్రమాదం ఉంది.

వాస్తవానికి, ఆవిధంగా లైంగిక అంటువ్యాధులకు గర్భవతి గురయితే ఆమెకు పుట్టబోయే  పిల్లలకి కూడా ఆ లైంగిక అంటువ్యాధులు బదిలీ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒకవేళ లైంగిక చరిత్ర గురించి తెలియని మరొకరితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని గర్భవతి ఎంచుకుంటే, ఆమె తన గర్భస్థ శిశువుకు లైంగిక అంటువ్యాధులు సోకే ప్రమాదాన్ని నివారించడానికి కండోమ్స్ వంటి రక్షిత పరికరాలను ఉపయోగించడం  అవసరం.

అసురక్షితమైన సంభోగం విషయంలో, వెంటనే మీ డాక్టర్ని సందర్శించడం మంచిది. సిఫిలిస్ లేదా గోనేరియా వంటి కొన్ని వ్యాధులకు చికిత్స చేయవచ్చు. అటువంటి వ్యాధుల్ని ప్రారంభదశలోనే గుర్తిస్తే గర్భంలోని పిండానికి హానిని నివారించవచ్చు.

గర్భధారణ సమయంలో జీవిత భాగస్వామితో సంభోగం జరిపేటపుడు కూడా జాగ్రత్త వహించాలి. ఏ సమయంలోనైనా సరే  మీకు గాని లేదా మీ భాగస్వామికి గాని లైంగిక అంటువ్యాధి సోకిందని మీరు భావిస్తే, మీరు మీ డాక్టర్తో సంప్రదించడం ఉత్తమం.

మీరు శిశువును కనడానికి ప్రణాళిక (ప్లాన్) చేయడానికి ముందు, లేదా కనీసం గర్భం ప్రారంభంలోనే నైనా,  మిమ్మల్ని మరియు మీ భాగస్వామిని లైంగిక అంటువ్యాధుల (ఎస్టీడీల) తనిఖీకి పరీక్షలు చేయించుకోవాలని మీకు సిఫార్సు చేయబడింది. ఈ ముందు జాగ్రత్త చర్యలు అవాంఛిత లైంగిక అంటువ్యాధుల (STDs) ప్రమాదం నుండి మీ బిడ్డను కాపాడటానికి వీలు పడుతుంది.

(మరింత చదువు: సురక్షిత సంభోగం పొందడం ఎలా )

గర్భధారణ సమయంలో సంభోగం సురక్షితమేనని ఇప్పుటివరకూ చెప్పబడింది, అయితే మరో సాధారణ ఆందోళన పొడజూపుతోందిపుడు, అదేమంటే, గర్భధారణలో సంభోగం ఎలా జరపాలనేది. గర్భం ధరించిన ప్రారంభ దశలలో, మీరు యథాలాపంగా ఇంతకు ముందు సంభోగం జరిపిన విధంగానే మీరు సాధారణ సంభోగాన్ని పొందవచ్చు.

అయితే, గర్భం పెరిగేకొద్దీ మీరు మీ శరీరం పట్ల శ్రద్ధ వహించడం అవసరం మరియు లైంగిక సంభోగం సమయంలో పిండం యొక్క రక్షణ, దాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పొట్టలో పెరుగుతున్న శిశువు కారణంగా గర్భం పెరుగుతుంది కాబట్టి సంప్రదాయ పద్ధతిలో పురుషుడిని మీ పైన ఉండే భంగిమలో సంభోగం చేయడం కష్టం అవుతుంది.

ఒకవేళ ఈ పద్ధతిలో మీకు శారీరక అసౌకర్యం కలిగించకపోయినా, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో సంభోగించడం మంచిది కాదు. ఈ భంగిమలో, అంటే గర్భవతి ఉదారంపై పురుషుడు) సంభోగం జరపడంవల్ల పురుషుడి మొత్తం బరువు మీ కడుపు మీద మోపబడుతుంది, ఆ బరువు యొక్క ఒత్తిడి పిండానికి కూడా చేరి దాని అభివృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉంది.

దీనిని నివారించేందుకు, మీకు తగినట్లుగా, మీకుసౌకర్యంగా ఉండేవిధంగా, అంటే పురుషుడిపై మీరు లేదా పక్కపక్కన ఉండే భంగిమ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని లేదా భంగిమల్ని మీరు అభ్యసించవచ్చు. ఈవిధంగా చేయడంవల్ల ఎలాంటి హాని కలిగే అవకాశం లేదు. మీరు సౌకర్యవంతమైనదిగా భావిస్తే, మీ వెనుక వైపు నుండి సంభోగించుకునే లైంగిక భంగిమను కూడా మీరు ఎంచుకోవచ్చు.

వివిధ భంగిమల్ని ప్రయత్నించిన తర్వాత, మీరు మరియు మీ భాగస్వామికి గర్భధారణ సమయంలో సరిపోయే సరైన భంగిమ ఏది అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. గర్భధారణ సమయంలో ఈ భంగిమలవంటి విషయాల్ని జీవిత భాగస్వాములిద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఉత్తమం. సంభోగ సమయంలో అసౌకర్యంగా ఉండకూడదు.

గర్భధారణ సమయంలో మౌఖిక సంభోగం - Oral sex during pregnancy in Telugu

గర్భధారణలో సంభోగం మీకు అసౌకర్యంగా ఉంటే, మీ భాగస్వామితో కొంత శారీరక సాన్నిహిత్యం కావాలంటే, మీరు మౌఖిక సంభోగాన్ని (నోటి సెక్స్) పొందవచ్చు. ఇది మీ శరీరంపై ఎటువంటి బరువును మోపదు మరియు ఎలాంటి బలమైన కదలికలను కలిగి ఉండదు కాబట్టి. మౌఖిక సంభోగం సాధారణంగా గర్భధారణ సమయంలో సంభోగం యొక్క సురక్షితమైన రూపంగా పరిగణించబడుతుంది. అయితే  అంటువ్యాధుల ప్రమాదాన్ని నివారించడానికి మీరు నోటి డ్యామ్ పరికరాలను లేదా కండోమ్నుఉపయోగించవచ్చు.

గర్భధారణలో సంభోగం: సురక్షితమైన సమయం - Sex during pregnancy: safe time in Telugu

గర్భధారణ సమయంలో సంభోగం సాధారణంగా సురక్షితంగా భావించబడుతుంది, కానీ ఇది అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. ప్రధాన శరీర మార్పులు ఏర్పడని గర్భధారణ ప్రారంభ దశలలో లేదా మొదటి త్రైమాసికంలో సంభోగం సురక్షితమైనదే. రెండవ త్రైమాసికంలో కూడా సురక్షితంగా పరిగణించబడుతుంది, కానీ అధిక బరువు పెరుగుట మరియు గర్భంపెరుగుదల సంభవిస్తుంది కాబట్టి మూడవ త్రైమాసికంలో సంభోగం పొందకుండా ఉండడం మంచిది, ఎందుకంటే ఈసమయంలో సంభోగం అసౌకర్యంగా తయారవుతుంది మరియు పిండాన్ని దెబ్బ తీయచ్చు. అయితే, ఈ దశలో మీరు సంభోగించాలనుకుంటే పైన చెప్పినట్లుగా పిండం మీద బరువును తగ్గించటం తప్పనిసరి.

గర్భధారణ సమయంలో సంభోగం పొందకూడని ఒక ప్రత్యేక సందర్భం ఉంది, అదే గర్భవతి యొక్క గర్భము పగిలిపోయి దానినుండి నీరంతా (ఉమ్మనీరు) కారిపోయినపుడు. ఇలాంటి సమయంలో సంభోగం స్త్రీకి చాలా బాధాకరంగా ఉంటుంది. అంతేగాక, అలా0టి సమయంలో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి తగిన చికిత్స చేయించడం చాలా అత్యవసరం.

గర్భధారణ సమయంలో సంభోగం సురక్షితమేనని చెప్పబడుతున్నందున, ఇది అందరు జంటలకు వరితీస్తుందా? ప్రతి గర్భధారణా విభిన్న అనుభవాల్ని కల్గి ఉంటుంది గనుక గర్భధారణ సమయంలో సంభోగం సురక్షితమేనన్న సంగతి నిజం కాదు. గర్భధారణ సమయంలో సంభోగం కొందరు మహిళల్లో తీవ్రమైన నష్టాలను కలుగజేయవచ్చు. ఈ నష్టాల గురించి ఈ విభాగంలో చర్చించబడతాయి.

సాధారణ గర్భధారణలో, పిండం పొత్తికడుపులో లోతుగా ఉండి పెరుగుతూ ఉంటుంది మరియు అధఃశ్లేష్మకస్తరము (mucosa) ద్వారా తగినంతగా రక్షించబడుతుంది. ఇంకా, గర్భాశయంలోని శ్లేష్మం, బ్యాక్టీరియా మరియు ఇతర వ్యాధినిరోధక ఎజెంట్ల ప్రవేశాన్ని ఆడుకుని పిండమునకు హాని కలుగకుండా నిరోధిస్తుంది. అయితే, సంక్లిష్టమైన గర్భాలలో, సంభోగం ముందస్తు ప్రసవాలు (గర్భధారణ యొక్క 37 వారాల కాలపరిధికి ముందుగానే జన్మించే ప్రమాదం) మరియు అనేక ఇతర సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది.

అధిక ప్రమాదానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు క్రింద ఇవ్వబడ్డాయి:

 • ముందస్తు గర్భం యొక్క లేదా చరిత్ర - ఇట్టి స్థితిలో సంభోగించడంవల్ల ముందస్తు ప్రసవ ప్రమాదాన్ని పెంచుతుంది
 • గర్భస్రావం యొక్క చరిత్ర- గతంలో గర్భస్రావం కలిగిన స్త్రీలు గర్భధారణ సంభోగం పొడడంవల్ల గర్భాశయ సంకోచాల తీవ్రత పెరిగే సంభావ్యత ఉంది, తద్వారా గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
 • గర్భాశయంలో కంతుల (fibroids) ఉనికి - ఇది బాధాకరమైన సంభోగానికి  దారితీయవచ్చు
 • బలహీనమైన లేదా అసమర్థమైన గర్భాశయాన్ని కలిగి ఉండడం- ఇది ముందస్తు ప్రసవ ప్రమాదాన్ని పెంచుతుంది
 • మాయ (placenta) చాలా దిగువకు ఉన్నప్పుడు- ఇది కూడా ముందస్తు ప్రసవాలకు  కారణం కావచ్చు
 • యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉనికి లేదా మూత్రవిసర్జన సమయంలో మండుతున్నట్లు  లేదా నొప్పి  లక్షణాలు - ఇది పిండానికి అభివృద్ధి రుగ్మతలు మరియు తల్లికి మూత్రపిండాల సమస్యలను కలుగజేసే ప్రమాదముంది.
 • యోని స్రావం ప్రమాదం - గర్భధారణ సంభోగం అధిక యోని రక్తస్రావ ప్రమాదాన్ని పెంచుతుంది
 • పొత్తి కడుపునొప్పి - ఈ సందర్భంలో గర్భధారణ సంభోగంవల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది
 • అమ్నియోటిక్ ద్రవం యొక్క లీకేజ్- అమ్నియోటిక్ తిత్తి చీలిపోయి ఉన్నప్పుడు, తల్లికి హాని కలిగించే బ్యాక్టీరియా, గర్భాశయం వరకు చేరుతుంది, పిందానికి కూడా అంటువ్యాధులు కల్గించే ప్రమాదముంది.
 • యోని లేదా పునరుత్పాదక సమస్యల చరిత్ర
 • ఆలస్యమైన గర్భధారణ (లేట్ గర్భం) - ఇది తరచూ పలు సమస్యలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది
 • కవలల జనన ఊహ లేదా గర్భంలో బహుళ పిండాల్ని (foetuses) కలిగి ఉండడం- ఇది తరచుగా ఒక క్లిష్టమైన గర్భం
 • మీ భాగస్వామి ఒక లైంగిక అంటువ్యాధి (STD) లేదా ఏదైనా ఇతర అంటురోగాల బారిన పడినట్లయితే- పిండానికి కూడా సంక్రమించవచ్చు
 • బహుళ గర్భస్రావాలకు గురైన మహిళలు - ఇది గర్భస్రావం యొక్క అపాయాన్ని కలిగి ఉంటుంది.

ఇలాంటి సందర్భాల్లో, గర్భధారణ సమయంలో సంభోగం చేయటానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే, పిండానికి మరియు తల్లికీ కూడా సమస్యలు తలెత్తవచ్చు.

గర్భధారణ సమయంలో సంభోగంలో పాల్గొంటే సంభవించే సంక్లిష్టతలను కింది విధంగా సూచించడమైంది:

 • కటి-సంబంధమైన వాపు-మంట (పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్) వ్యాధి - చిన్న వయసులోనే గర్భవతులైన (కౌమారదశ) వారిలో ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది
 • రక్తస్రావం (హేమరేజ్)
 • వీనస్ ఎయిర్ ఎంబోలిజం (Venous air embolism)నరాల్లో గాలిబుడగలు చేరే సమస్య
 • నెలలు నిండకనే వచ్చే ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం

సాధారణ గర్భధారణలో సంభోగాన్ని సురక్షితంగానే భావిస్తారు. గర్భధారణ ప్రారంభంలో జంటలు సాధారణంగా సంభోగంలో పాల్గొంటూవుంటారు, గర్భం పెరిగేకొద్దీ శారీరక అసౌకర్యం కారణంగా సంభోగం యొక్క పౌనఃపున్యం (frequency) తగ్గిపోతూఉంటుంది. ఏదేమైనప్పటికీ, లైంగిక క్రియను సురక్షితంగా జరిపితే ప్రసవం ప్రారంభమయ్యే వరకు దంపతులు సంభోగంలో పాల్గొనవచ్చు.  

పిండం మీద బరువు వేయని సంభోగ భంగిమల్ని దంపతులు ఎంచుకొని వాటిని పాటించడం మంచిది. గర్భధారణ చివరిదశ వరకూ కూడా సంభోగంలో పాల్గొనడం లాభదాయకంగానే పరిగణించబడుతోంది, ఎందుకంటే సంభోగ క్రియ గర్భవతి శరీరాన్ని ప్రసవానికి సన్నద్ధం చేస్తుంది.  

అయితే, మీరు గనుక గర్భస్రావ ప్రమాదానికి  గురవుతారని ముందస్తుగా హెచ్చరించబడినా లేదా మీకు  గర్భస్రావం చరిత్ర ఉంటే సంభోగంలో పాల్గొనకుండా సంయమనం పాటించాల్సిందిగా మీకు సలహా ఇవ్వడమైంది. అంటురోగాలున్న సందర్భంలో, చాలా ఆలస్యంగా వచ్చిన గర్భం (latepregnancy) లేదా చాలా ముందుగా వచ్చిన గర్భం (early pergnancy), అధిక నొప్పి, గర్భాశయంలో కంతులున్నా (ఫైబ్రోయిడ్స్) లేదా యోని స్రావం మరియు గర్భంలో చాలా  పిండాల ఉనికి ఉన్నా గాని సంభోగంలో పాల్గొనకుండా ఉండడం ఉత్తమం.

और पढ़ें ...

వనరులు

 1. Mahboobeh Kafaei Atrian et al. The Association of Sexual Intercourse During Pregnancy With Labor Onset . Iran Red Crescent Med J. 2015 Jan; 17(1): e16465. PMID: 25763253
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; STDs during Pregnancy - CDC Fact Sheet
 3. American Pregnancy Association. [Internet]; Urinary Tract Infection During Pregnancy.
 4. nidirect [Internet]. Government of Northern Ireland; Sex during pregnancy
 5. Malikha V. Rogers. SEX DURING PREGNANCY: COMMON QUESTIONS AND PRACTICAL ANSWERS. JOURNAL OF THE NATIONAL MEDICAL ASSOCIATION, VOL. 75, NO. 11, 1983
 6. Claire Jones, Crystal Chan, Dan Farine. Sex in pregnancy . CMAJ. 2011 Apr 19; 183(7): 815–818. PMID: 21282311