బార్టోనెల్లోసిస్ - Bartonellosis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

March 06, 2020

బార్టోనెల్లోసిస్
బార్టోనెల్లోసిస్

బార్టోనెల్లోసిస్ అంటే ఏమిటి?

బార్టోనెల్లోసిస్ అనేది బార్టోనెల్ల (Bartonella) జాతులు బాక్టీరియా వలన కలిగే ఒక అంటువ్యాధుల/ ఇన్ఫెక్షన్ల  సమూహాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఇది పెద్దవారిలో 1,00,000 జనాభాకు 6.4 కేసులలో మరియు 5-9 సంవత్సరముల వయస్సులో ఉన్న పిల్లలలో 1,00,000 జనాభాకు 9.4 కేసులలో నివేదించబడింది. ఇది అన్ని వయస్సు సమూహాలను ప్రభావితం చేస్తుంది, కానీ తరచూ 21 ఏళ్ల వయస్సు లోపు వారికీ వస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఇది ఒక స్వీయంగా తగ్గిపోయే వ్యాధి మరియు శోషరస కణుపుల (lymph nodes) వాపు మరియు తరువాత జ్వరం లేదా అలసట వంటి లక్షణాలతో ఉంటుంది. లక్షణాలు ఎల్లప్పుడూ కనిపించవు. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తి ఈ సంక్రమణకు/ ఇన్ఫెక్షన్కు  గురైయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పిల్లి స్క్రాచ్ వ్యాధి (Cat scratch disease) :

  • రోజులు లేదా వారాల పాటు లక్షణాలు కనిపించకపోవచ్చు.
  • ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో చర్మంపై ఒక ఎర్ర మచ్చ కనిపించవచ్చు మరియు కొన్ని రోజుల తర్వాత  అది పెరగవచ్చు.
  • నొప్పిలేని, దురద లేని బొడిపెలు కలుగుతాయి, అవి గుర్తించబడవు  లేదా గాయం కారణంగానెమో అని అనిపిస్తాయి.
  • ఇతర లక్షణాలు కండరాల నొప్పి, అనారోగ్యం, అలసట మరియు తలనొప్పి.
  • చాలా తక్కువ సార్లు గొంతులో పుండ్లు, ఆకలి తగ్గుదల మరియు బరువు నష్టం ఉండవచ్చు.

కారియన్స్ వ్యాధి (Carrion’s disease):

  • ఈ వ్యాధికి రెండు దశలు ఉంటాయి: ఆకస్మిక తీవ్రమైన దశ (sudden acute phase) (ఒరోయా జ్వరం)(Oroya fever) మరియు దీర్ఘకాలిక,నిరపాయక  దశ (chronic, benign phase) (వెర్రుగా  పెరువానా) (verruga peruana).
  • ఓరోయా జ్వరం అనేది  జ్వరం, చలి, బలహీనత, తీవ్ర తలనొప్పి, చెమట మరియు పాలిపోయిన  చర్మం వంటి లక్షణాలతో ఆకస్మికంగా వస్తుంది.
  • వెర్రుగా పెరువానా అనేది చికిత్స చేయని వ్యక్తులలో సంభవిస్తుంది. చిన్న ఎర్రటి గాయాలు చర్మం మీద కనిపిస్తాయి మరియు తరువాత అవి బొడిపెలల మారుతాయి. వాటి వెంట రక్తస్రావం కూడా రావచ్చు, పుండ్లుగా మారవచ్చు లేదా బొబ్బలు రావచ్చు.

ట్రెంచ్ జ్వరం (Trench fever):

  • ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలను  కొన్ని రోజులు లేదా తర్వాత 5 వారాల తర్వాత కూడా గమనించవచ్చు.
  • ఆకస్మిక జ్వరం, తలనొప్పి, మైకము, చలి, బలహీనత మరియు కాళ్ళ మరియు నడుము నొప్పి గమనించవచ్చు.
  • తాత్కాలిక చర్మ దద్దుర్లు మరియు ప్లీహము (spleen) లేదా కాలేయము యొక్క పెరుగుదల చూడవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

బార్టోనేల్ల జాతి సూక్ష్మజీవుల వలన బార్టోనోలసిస్  సంక్రమణ/ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది.

పిల్లి స్క్రాచ్ వ్యాధి (Cat scratch disease) బార్టోనెల్లా హెన్సెల్లె (Bartonella henselae)  వలన కలుగుతుంది.

  • ఇది ప్రధానంగా పిల్లులు నాకడం, రక్కడం లేదా కొరకడం ద్వారా సంభవిస్తుంది.
  • మానవులకు పిల్లుల మీద ఉండే చిన్న పురుగుల ద్వారా ఈ వ్యాధి  సంభవిస్తుంది.
  • పెద్ద పిల్లుల కంటే పిల్లి పిల్లలు ద్వారా సంక్రమణ వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ, ఇవి సాధారణంగా  లక్షణాలు పైకి కనిపించకుండా ఉంటాయి.

కారియన్స్ వ్యాధి (Carrion’s disease) బార్టోనెల్లా బాసిల్ఫార్మిస్ (Bartonella bacilliformis) వల్ల కలుగుతుంది.

  • ఈ బ్యాక్టీరియా చిన్న మట్టి పురుగుల కాటు ద్వారా వ్యాపిస్తుంది మరియు రక్తప్రవాహంలోని  ఎర్ర రక్త కణాల ఉపరితలంతో అంటుకుంటుంది.
  • దాని జీవ క్రియ మలేరియా సంక్రమణ మాదిరిగానే ఉంటుంది, ఇది హేమోలిటిక్ రక్తహీనతకు (haemolytic anaemia) దారితీస్తుంది.

బార్టోనెల్లా క్వింటానా (Bartonella quintana) వల్ల  ట్రెంచ్ జ్వరం (Trench fever) సంభవిస్తుంది.

  • ఈ బాక్టీరియా మానవ శరీరంలోకి పేను ద్వారా సంక్రమిస్తుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి ?

మునుపటి వ్యాధి బహిర్గతానికి మరియు ప్రత్యేక సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా ప్రాథమిక రోగ నిర్ధారణను చేయవచ్చు. విశ్లేషణ పరీక్షలు కూడా ఉన్నాయి:

  • బ్యాక్టీరియల్ సెరోలజీ పరీక్ష అనేది IgM మరియు IgG  యాంటీబాడీస్ కోసం నిర్వహించే ఇమ్మ్యూనో ఫ్లోరోసెంట్ యాంటీబాడీ (IFA) పరీక్ష (immunofluorescent antibody (IFA) test).
  • పొలిమేరెస్ చైన్ రియాక్షన్ (Polymerase chain reaction (PCR)) ఉపయోగించి  బార్టోనెల్లా సంక్రమణను పరీక్షించవచ్చు. ఇది DNA సీక్వెన్సింగ్ ద్వారా ధృవీకరించబడుతుంది.
  • వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ (Western blot test) కూడా మంచి ఫలితాలను చూపింస్తుంది.
  • బాక్టీరియాల సాగు పరీక్ష (culture test) సాధ్యమే, కానీ ఆ బ్యాక్టీరియా ప్రయోగశాలలో పెరగడానికి సమయాన్ని తీసుకుంటుంది మరియు  సాధారణంగా వాటిని పెంచడం కష్టం.

చికిత్స పద్ధతులు:

  • సంక్లిష్ట సందర్భాలలో యాంటిబయోటిక్స్ చికిత్సకు ప్రధాన మార్గం.
  • క్యాట్ స్క్రాచ్ వ్యాధి దానికదే  స్వంతంగా తగ్గిపోతుంది. నొప్పి నుండి ఉపశమనం కలిగించే మందులను ఇవ్వవచ్చు, మరియు శోషరస కణుపుల (lymph nodes) పైన ఉన్న చర్మానికి  వేడి కాపడాన్ని ఉపయోగించవచ్చు.
  • క్యాట్ స్క్రాచ్ వ్యాధిలో వచ్చే మెదడు వాపు లాంటి సమస్యలు సాధారణంగా పూర్తి తగ్గుదలను  చూపిస్తాయి.

నివారణ మరియు స్వీయ రక్షణ చిట్కాలు:

  • విచ్చలవిడిగా పిల్లులు గీరడం నుంచి  తప్పించుకోవాలి. పెంపుడు పిల్లులను ఇంట్లోనే  ఉంచాలి.
  • పిల్లులను  పట్టుకున్న తరువాత చేతులు సరిగ్గా కడగాలి.
  • పొడవాటి  చొక్కా చేతులున్న దుస్తులను ధరించాలి.
  • ఈగలు మరియు పేనుల కోసం వికర్షకాలను (repellents) ఉపయోగించాలి.



వనరులు

  1. Journal of Neuroinfectious Diseases. Neurological Manifestations of Bartonellosis in Immunocompetent Patients: A Composite of Reports from 2005–2012. OMICS International; ISSN: 2314-7334
  2. American society for microbiology. Recommendations for Treatment of Human Infections Caused by Bartonella Species. Washington DC, USA.
  3. AIDSinfo. Bartonellosis . U.S. Department of Health and Human Services. [internet].
  4. National Organization for Rare Disorders. Bartonellosis. USA. [internet].
  5. Lyme and Tick-Borne Diseases Research Center. Bartonellosis. Columbia University. [internet]
  6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Bartonella Infection (Cat Scratch Disease, Trench Fever, and Carrión’s Disease)
  7. International journal of infectious diseases. Prevalence of Bartonella henselae infection and its diagnosis in diverse clinical conditions in a tertiary care hospital in North India. International society of infectious diseases. [internet].
  8. Mada PK, Zulfiqar H, Joel Chandranesan AS. Bartonellosis. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan