రొమ్ముల్లో గడ్డలు అనేది రొమ్ముల్లో అసాధారణ కణజాల పెరుగుదలలు. అవి గుండ్రంగా లేదా క్రమరహితంగా, నొప్పిలేకుండా లేదా నొప్పిగా, పండ్లతో లేదా పుండ్లు లేకుండా, మృదువుగా లేదా గట్టిగా, మరియు క్యాన్సర్ లేదా క్యాన్సర్ కానివిగా ఉంటాయి. చాలా రొమ్ము గడ్డలు హానికరం కాదు. అందువల్ల, మీరు వాటిని గుర్తించినపుడు లేదా రొమ్ము గడ్డలతో బాధపడుతున్నప్పుడు, చింతించకండి. అయినప్పటికీ, వాటిని వైద్యుడి సహాయం లేకుండా నిర్ధారణ చెయ్యలేము .

అందువలన, మీకు మీ రొమ్ముల్లో గడ్డలున్నాయని అనుమానం వచ్చినప్పుడు వైద్య సహాయం కోసం ఆలస్యం చేయరాదు. రొమ్ముల్లో గడ్డలను విస్మరించడం అనేది మంచి ఆలోచన కాదు, ఎందుకంటే అవి వ్యాప్తి చెందుతాయి మరియు అసౌకర్యం కలిగించవచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి తీవ్రమైన సమస్యలను కలిగించవచ్చు మరియు మీ రొమ్ము కూడా తీసివేయబడవచ్చు.

 1. క్యాన్సర్ కాని రొమ్ము గడ్డలు - Non cancerous breast lumps in Telugu
 2. క్యాన్సర్ గడ్డలు - Cancerous lumps in Telugu
 3. ఇంట్లో రొమ్ము గడ్డలను ఎలా తనిఖీ చెయ్యాలి - How to check for breast lumps at home in Telugu
 4. రొమ్ముల్లో గడ్డల లక్షణాలు - Breast lump symptoms in Telugu
 5. రొమ్ము గడ్డల కారణాలు మరియు ప్రమాద కారకాలు - Breast lump causes and risk factors in Telugu
 6. రొమ్ముల్లో గడ్డల రోగ నిర్ధారణ - Diagnosis for lump in breast in Telugu
 7. రొమ్ముల్లో గడ్డల చికిత్స - Breast lump treatment in Telugu

క్యాన్సర్ కాని రొమ్ముగడ్డలు అనేవి రొమ్ముల్లో అసాధారణంగా పెరుగుతాయి వాటిల్లో క్యాన్సర్ కణాలు ఉండవు. అవి రొమ్ము కణజాలం వెలుపల వ్యాపించవు మరియు వాటి వల్ల ప్రాణహాని ఉండదు.

 • నిరపాయకకణితి (Fibroadenoma)
  ఇది మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే రొమ్ము గడ్డ. ఒక నిరపాయకకణితి, రొమ్ము యొక్క నార మరియు మాంసపు కణజాలం యొక్క అసాధారణ పెరుగుదల. ఈ గడ్డలు సాధారణంగా రొమ్ములో మృదువు నుండి గట్టిగా ఉండి కదులుతూ ఉంటాయి. అవి చుట్టుపక్కల ఉన్న రొమ్ము కణజాలానికి అంటుకొని ఉండవు.
 • తిత్తులు (Cysts)
  తిత్తులు మృదువుగా, ద్రవంతో నిండిన సంచి వంటి పెరుగుదలలు ఎక్కువగా గుండ్రంగా ఉంటాయి. అవి ఛాతీలో కొద్దిగా నొప్పికి కూడా కారణం కావచ్చు.
 • ఫైబ్రోసిస్టిక్ వ్యాధి (Fibrocystic disease)
  రొమ్ముల యొక్క ఫైబ్రోసైస్టిక్ వ్యాధి మూడు రకాల కణజాల నష్టాన్ని కలిగిగిస్తుంది, ఇందులో తిత్తి ఏర్పడటం, ఫైబ్రోసిస్ ( నార (ఫైబ్రస్) కణజాల అసాధారణ పెరుగుదల) మరియు రొమ్ము గ్రంధుల కణజాలం యొక్క అధిక పెరుగుదల ఉంటాయి.
 • కురుపులు (Abscesses)
  రొమ్ములో ఇన్ఫెక్షన్ వలన కురుపులు ఏర్పడతాయి. అవి కొన్నిసార్లు రొమ్ము చర్మంలో పుండ్లతో సంబంధం కలిగి ఉండవచ్చు. అవి బాధాకరముగా మరియు అసౌకర్యంగా ఉంటాయి. కురుపులు సాధారణంగా చునుబాలిచ్చే మహిళల్లో సంభవిస్తాయి.
 • అడెనోమా (Adenoma)
  అడెనోమాలు అనేవి రొమ్ముల లోపలి గోడ లేదా ఎపితెలియం యొక్క గ్రంధులు అసాధారణంగా పెరుగుతున్నప్పుడు ఏర్పడే కణితులు.
 • పిలిపిరికాయ (Papilloma)
  పిలిపిరికాయలు చిన్న వేలు వంటి పెరుగుదలలు,ఇవి పాలు నాళాల (milk ducts) లోపల మరియు బయట పెరుగుతాయి. వాటికి చనుమొనల నుండి స్రావాల విడుదలతో కూడా సంబంధం ఉండవచ్చు. ఈ స్రావాల విడుదల కొన్ని సార్లు రక్తాన్ని కూడా చూపుతుంది.
 • లిపోమా మరియు కొవ్వు నెక్రోసిస్ (Lipoma and fat necrosis)
  లిపోమా అనేది రొమ్ము లోపల కొవ్వు కణజాలం యొక్క అసాధారణ పెరుగుదల. రొమ్ము యొక్క కొవ్వు కణాలు మరణించినప్పుడు మరియు విచ్చేదనకు గురైనప్పుడు కొవ్వు నెక్రోసిస్ ఏర్పడుతుంది.

క్యాన్సర్ గడ్డలు ప్రారంభంలో బాధాకరమైనవి కావు, కానీ అవి చాలా వేగంగా పెరుగుతాయి. వాటికి నిర్వచించిన హద్దులు ఏమి లేవు. ఈ పెరుగుదలలు సమీపంలోని కణజాలాలకు విస్తరించి వాటిని నాశనం చేస్తాయి. అవి సాధారణంగా గట్టిగా ఉండి, పరిసర లేదా అంతర్లీన రొమ్ము కణజాలంలో స్థిరంగా ఉంటాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, కొన్ని క్యాన్సర్ కణాలు బయటకు వ్యాపించి శరీరంలోని వేర్వేరు భాగాలకు వెళ్లి అక్కడ క్యాన్సర్ కు కారణమవుతాయి. దీనిని క్యాన్సర్ యొక్క విపరీత భావము (కణజాల వ్యాప్తి) (మెటాస్టాసిస్) అని అంటారు.

రొమ్ము స్వీయ పరీక్ష అనేది మీ రొమ్ములు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి ఒక మంచి పద్ధతి. అందువల్ల ప్రతి నెల ఇలా చేయ్యడం వల్ల మీ రొమ్ముల్లో ఏదైనా అసహజత ఉంటే మీకు తెలుస్తుంది. రొమ్ము పరీక్ష ప్రతి నెలలో మూడు నుంచి అయిదు రోజులు మీ ఋతుక్రమ సమయం తర్వాత చేయండి. మీ రొమ్ములను మీరే పరిశీలించడానికి ఈ దశలను అనుసరించవచ్చు:

క్రింద పడుకుని
మీ రొమ్ముల యొక్క మెరుగైన పరీక్షకు క్రింద పడుకుంటే గడ్డలు ఉన్నాయో లేదో గుర్తించడం సులభం అవుతుంది. మీరు క్రింద పడుకుని మీ తల వెనుక మీ ఎడమ చేతిని పెట్టండి, మీ కుడి చేతితో, మీ ఎడమ రొమ్ము పరిశీలించడం ప్రారంభించండి. అలా మీ రొమ్ములను తనిఖీ చేయడానికి చిన్న, సున్నితమైన కానీ గట్టిగా, వృత్తాకార కదలికలను ఉపయోగించండి. మీ రొమ్ము దిగువ నుండి ప్రారంభించి పై వరకు చేరండి. మీ కుడి రొమ్ము పరిశీలించడానికీ, మీ తల వెనుక మీ కుడి చేతిని ఉంచాలి అదే విధానం పునరావృతం చెయ్యండి.

కూర్చొని
క్రింద పడుకొని చేసే పరీక్ష పూర్తి చేసిన తర్వాత, మీరు కూర్చుని, చంకలను పరిశీలించడం మొదలుపెట్టాలి ఎందుకంటే రొమ్ము కణజాలం చంక వరకు కూడా విస్తరించి ఉంటుంది. ఏదైన అసాధారణ వృద్ధి లేదా గడ్డను తనిఖీ చెయ్యడం కోసం మీ చంకలలో లోతైన ప్రాంతాలకు అదే వృత్తాకార కదలికలను ఉపయోగించండి. వాటిని నుండి ఏదైనా స్రావాలు కారుతున్నాయా అని చూడటానికి చనుమొనను నిదానంగా పిండి చూడవచ్చు.

నిల్చొని
మీరు రెండు విధాలుగా ఈ పరీక్ష చేయవచ్చు; మీ తలపై చేతులు పెట్టడం మీ లేదా నడుము మీద చేతులు పెట్టడం మరొకటి. మీరు ఇలా చేసి, అద్దంలో మీ రొమ్ములను చూస్తూ ఈ క్రింది విషయాల కోసం తనిఖీ చేయండి:

 • రొమ్ముల రెండు ఆకృతులు కొంచెం అటు ఇటుగా సమానంగా ఉండాలి.
 • రెండు రొమ్ముల చర్మం మీ శరీరం చర్మాని పోలి మరియు సాధారణంగా ఉందా అని తనిఖీ చెయ్యండి.
 • రొమ్ములపై ఏదైన సొట్ట లేదా నారింజ తొక్కలా ఉందా అని చూడండి. అలా ఉన్నట్లయితే, మీరు వైద్యున్ని సంప్రదించాలి.
 • రెండు రొమ్ముల పరిమాణం సమానంగా ఉండాలి.
 • రెండు చనుమొనల యొక్క స్థానం దాదాపు అదే స్థాయిలో ఉండాలి.
 • చనుమొనల లోపలికి మునిగినట్టు లేదా సంకోచం ఉన్నదేమో చూడండి.

రొమ్ముల్లో గడ్డలు ఉంటే క్రింది లక్షణాలలో ఏదోకటి లేదా అంతకంటే ఎక్కువ అనుభవించవచ్చు:

 • ఇతర రొమ్ముతో పోలిస్తే ఒకటి ఆకస్మికంగా విస్తరించి ఉండవచ్చు.
 • నారింజ తొక్కలా చనుమొన చుట్టూ ఉన్న మరియు మిగతా రొమ్ము ప్రాంతం కనిపిస్తుంది.
 • ఒకటి లేదా రెండూ చనుమొనల్లో అసాధారణ మార్పు.
 • పసుపు, తెల్లటి పసుపు, ఆకుపచ్చ, గోధుమ మరియు ఎర్రగా ఉండే స్రావాలు రొమ్ముల నుండి కారవచ్చు. తరచుగా ఎరుపు రంగు స్రావాలు లేదా రక్తస్రావం ఉంటే వెంటనే ఒక వైద్యుడికి చెప్పాలి.
 • రొమ్ము కణజాలం యొక్క సొట్ట లేదా గుంట ఒకటి లేదా రెండూ రొమ్ముల్లో ఉన్నపుడు.
 • మీరు ఒకటి లేదా రెండూ రొమ్ముల్లో నొప్పిని అనుభవించవచ్చు.
 • బరువు నష్టం లేదా ఆకలి లేకపోవడం.
 • మీ రొమ్ములో ఒక గుండ్రని ముద్ద లేదా స్థిరమైన, మృదువైన గడ్డ యొక్క భావన ఉన్నపుడు

కారణాలు

రొమ్ము గడ్డల అభివృద్ధి చెండానికి కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 • సంక్రమణ (ఇన్ఫెక్షన్)
  రొమ్ము కణజాలం యొక్క అంటువ్యాధి (infection) చనుమొనల ద్వారా లేదా రక్త ప్రసరణలో అప్పటికే సంక్రమించే ఇన్ఫెక్షన్ గడ్డ ఏర్పడటానికి కారణమవుతుంది. చంకలో ఉన్న సంక్రమణ కూడా రొమ్ములో సంక్రమను కలిగిస్తుంది.
 • వాపు
  రొమ్ము కణజాలం వాపు కూడా నొప్పి లేదా అసౌకర్యం కలిగించవచ్చు.
 • గాయం
  రొమ్ములకు ఆకస్మిక దెబ్బలు లేదా గాయాలు కలిగినప్పుడు రొమ్ము కణజాలంలో గడ్డ, ఇన్ఫెక్షన్ లేదా వాపు అభివృద్ధికి కారణమవుతాయి.
 • రేడియేషన్
  శరీరంలో ఏదైనా ఒక వ్యాధికి రేడియోధార్మిక చికిత్స పొందుతున్నట్లయితే, రేడియోధార్మికత వల్ల దెబ్బతిన్న రొమ్ము కణాలు అసాధారణంగా పెరుగుతాయి.
 • క్యాన్సర్ కలిగించే వైరస్లు
  కొన్ని వైరస్లు మరియు బాక్టీరియాలు, రొమ్ము కణాలను మార్చివేస్తాయి ఫలితంగా వాటి అసాధారణ పెరుగుదలకు కారణం అవుతాయి. వీటిలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV), ఎప్స్టీన్-బార్ వైరస్, బోవిన్ లుకేమియా వైరస్ మొదలైనవి ఉన్నాయి.

ప్రమాద కారకాలు

రొమ్ము నిరపాయ గ్రంథులు మరియు రొమ్ము క్యాన్సర్ను పెంచే ప్రమాదానికి మీకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి:

 • లింగం
  "ఎన్ ఇంటర్నేషనల్ కంపారిసన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్విడెన్స్ రేట్స్" ప్రకారం, రొమ్ము గడ్డలు స్త్రీలలో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పురుషుల పోలిస్తే, ఇది స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువ స్థాయిలో ఉండటంతో కావచ్చు

 • ఊబకాయం
  అధిక బరువు ఉండటం వలన గుండె వ్యాధులను పొందడమే కాక, రొమ్ము గడ్డలు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. (మరింత సమాచారం: ఊబకాయం సమస్యలు

 • వయసు
  56 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న వృద్ధ స్త్రీలు, చిన్నవయసుల స్త్రీలతో పోలిస్తే క్యాన్సర్ మరియు క్యాన్సర్ కాని గడ్డలను అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, “బెనిన్ బ్రెస్ట్ డిసీజ్ హెపోరోజెనిటి:అసోసియేషన్ విత్ హిస్టోపాథాలజి,ఏజ్, అండ్ ఎంతనిసిటీ " అనే అధ్యయనం తెలుపుతుంది. ఎందుకంటే, రొమ్ముల మీద లైంగిక హార్మోన్ల ప్రభావం మెనోపాజ్ (ఋతు చక్రాల విరమణ) తర్వాత తగ్గిపోతుంది. అలాగే, రొమ్ము కణజాలం ఈ వయస్సు తర్వాత వెనుకకు తిరగడం మొదలవుతుంది మరియు చాలా తక్కువ కణ పెరుగుదల శాతం కలిగి ఉంటుంది.

 • రొమ్ము గడ్డలు లేదా క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర
  మీ తల్లితండ్రుల కుటుంబాలలో లేదా తక్షణ కుటుంబంలోని ఎవరైనా సభ్యులకి రొమ్ము గడ్డలు లేదా క్యాన్సర్ కలిగి ఉన్నట్లయితే, మీకు అలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గడ్డలు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 • మునుపటి రొమ్ము జీవాణుపరీక్షలు (Previous breast biopsies)
  మీ రొమ్ము కణజాలానికి ముందెప్పుడైనా జీవాణుపరీక్షను చేయించుకుంటే, ఆ బయాప్సీ మచ్చ కణజాలానికి సంబంధించి రొమ్ము గడ్డలను వృద్ధి చేసే అవకాశం ఉంది.

 • హార్మోన్ పునఃస్థాపన చికిత్స (Hormone replacement therapy)
  మెనోపాజ్ తర్వాత హార్మోన్ పునఃస్థాపన చికిత్స పొందిన స్త్రీలలో, రొమ్ము గడ్డల వృద్ధి యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంది అని " బెనిగ్న్ బ్రెస్ట్ డిసీస్ ఇన్ విమెన్ " అను ఒక సమీక్ష తెలిపింది.

 • ధూమపానం మరియు మద్యం
  "రీసెంట్ ఇంసైట్స్ ఇంటూ సిగరెట్ స్మోకింగ్ ఎజ్ ఏ లైఫ్ స్టైల్ రిస్క్ ఫాక్టర్ ఫర్ బ్రెస్ట్ కాన్సర్" (“Recent insights into cigarette smoking as a lifestyle risk factor for breast cancer”) ప్రకారం, ధూమపానం మరియు మద్యం మోతాదు కంటే ఎక్కువగా వాటిని తీసుకునే మహిళల్లో అవి రొమ్ము వ్యాధులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారణాల్లో ఒకటి.

 • జీన్ మ్యుటేషన్ (Gene mutation)
  BRCA1 లేదా BRCA2 జన్యువులు రొమ్ము మరియు అండాశయాలలో కణితులను అణచివేయడంలో సహాయపడే ఇటువంటి మాంసకృత్తులను (ప్రోటీన్స్) ఉత్పత్తి చేస్తాయి. అవి DNAను సరిదిద్దడంలో కూడా సహాయపడతారు మరియు అందుచేత జన్యు పదార్ధం యొక్క స్థిరత్వాన్ని నిర్వహిస్తాయి. ఈ జన్యువులలో ఏదైనా మ్యుటేషన్ (మార్పు) మహిళల్లో రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

రొమ్ము గడ్డల నిర్ధారణలో మూడు దశల ఉంటాయి సాధారణంగా వాటిని "ట్రిపుల్ అసెస్మెంట్" అని పిలుస్తారు. ఈ దశలు వైద్య అంచనా (క్లినికల్ అస్సెస్మెంట్), ప్రతిబింబనం (ఇమేజింగ్) మరియు జీవాణుపరీక్ష(బయాప్సీ).

వైద్య అంచనా(క్లినికల్ అసెస్మెంట్)

ఇది నిర్ధారణ యొక్క మొదటి దశ, రొమ్ము గడ్డలకు సంబంధించిన వ్యవధి మరియు లక్షణాలు గురించి ఒక అర్హతగల వైద్యుడు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. ఋతు చక్రాలు, మెనోపాజ్ వయసు, మీ పిల్లల గురించి, మీ కుటుంబంలోని రొమ్ము క్యాన్సర్ లేదా ఏ ఇతర క్యాన్సర్తో బాధపడిన ఎవరైనా కుటుంబ సభ్యుని గురించి వంటి ఇతర విషయాల గురించి వైద్యులు మిమ్మల్ని అడగవచ్చు. రొమ్ముగడ్డల స్వభావం, పరిమాణము మరియు విస్తరణ గురించి తెలుసుకోవడానికి రొమ్ముల యొక్క వివరణాత్మక శారీరక పరీక్షను చేస్తారు. వైద్యులు ఒకవేళ పురుషులైతే, ఒక మహిళా సహాయకురాలు లేదా ఒక నర్సు పరీక్ష సమయంలో కూడా ఉంటుంది.

ప్రతిబింబనం (ఇమేజింగ్)

క్లినికల్ పరీక్ష తరువాత, వైద్యుడు ఈ క్రింది దర్యాప్తు విధానాల్లో ఏదో ఒకటి లేదా ఏవైనా కొన్ని పరీక్షలు చేయించుకోమని సలహా ఇస్తారు:

 • మామోగ్రఫీ (Mammography)
  దీనిలో అంతర్గత మరియు బాహ్య రొమ్ము కణజాలం చిత్రాన్ని పొందడానికి తక్కువ మోతాదు X- కిరణాలను ఉపయోగిస్తారు. దాగి ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదలను మరియు గడ్డలను గుర్తించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధానాన్ని 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలులో ఉన్న పైకి తెలియని మరియు లక్షణాలు కనిపించని రొమ్ము గడ్డలను దర్యాప్తు చేయ్యదగిన ఒక స్క్రీనింగ్ పద్ధతిగా కూడా ఉపయోగిస్తారు.
 • అల్ట్రాసౌండ్(Ultrasound)
  ఇది సాధారణంగా 30 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో చేస్తారు. ఈ ప్రక్రియలో, ధ్వని తరంగాలను రొమ్ము కణజాలం గుండా పంపించడం జరుగుతుంది మరియు ఆ చిత్రాలు కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి.
 • MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) (Magnetic Resonance Imaging)
  MRI రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది రొమ్ము గడ్డలలో హానికర మరియు హానికరంకానివి రెండు రకాలను గుర్తించగలదు.

జీవాణుపరీక్ష(బయాప్సి)

ఇది మూడవ దశ మరియు రొమ్ము గడ్డల యొక్క రకాన్ని నిర్ధారించడానికి ఇది చాలా ప్రత్యేకమైన మరియు ప్రభావవంతమైనది. దీనిలో, రొమ్ము యొక్క కణజాలం బయటకు తీయబడుతుంది మరియు రొమ్ముల్లో అసాధారణ గడ్డల యొక్క రకాన్ని తెలుసుకోవటానికి దర్యాప్తు చేయబడుతుంది. ఫైన్ నీడిల్, కోర్ నీడిల్ లేదా ఎక్సిషన్ ఉపయోగించి బయాప్సీ చేయవచ్చు.

 • ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటోలజీ (Fine needle aspiration cytology, FNAC)
  దీనిలో, రొమ్ము యొక్క ప్రభావిత ప్రాంతంలో కణాలు మరియు ద్రవాన్ని బయటకు తియ్యడానికి చాలా సన్నని సూది ఉపయోగించబడుతుంది మరియు అవి (బయటకు తీసిన కణాలు, ద్రవం) ఒక సూక్ష్మదర్శిని (microscope) (కణాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పెద్ద అద్దపుబిళ్లతో ఉన్న టెలిస్కోప్-వంటి యంత్రం) క్రింద పరీక్షించబడతాయి.

 • కోర్ నీడిల్ జీవాణుపరీక్ష(Core needle biopsy)
  ఈ ప్రక్రియ సన్నని సూది జీవాణుపరీక్షను పోలి ఉంటుంది. FNAC ఉపయోగించిన దాని కంటే పెద్ద సూదిని దీనిలో ఉపయోగిస్తారు, అది మాత్రమే తేడా.

 • ఎక్సిసోనల్ జీవాణుపరీక్ష (Excisional Biopsy)
  ఈ ప్రక్రియలో, ప్రభావితమైన కణజాలం యొక్క చిన్న మొత్తాన్ని రొమ్ము నుండి ఒక క్రిమి-రహిత బ్లేడును ఉపయోగించి కోస్తారు. కణజాలం అప్పుడు ప్రయోగశాలలో విశ్లేషణ కోసం పంపబడుతుంది, ఇక్కడ రొమ్ములో ఉన్న గడ్డల రకాన్ని నిర్ధారించడానికి ఒక నిపుణుడు పరిశీలిస్తాడు.

రోగసంబంధి కణవ్యాప్తిని చూడడం కోసం ప్రతిబింబంనం (ఇమేజింగ్ ఫర్ మెటాస్టేసెస్)
శరీరం యొక్క ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందిందా అని అనుమానం ఉంటే ఈ పరీక్షలు జరుగుతాయి. ఛాతీ ఎక్స్-రే ఊపిరితిత్తులలోని మెటాస్టాసిస్ ను నిర్ణయించగలదు. కాలేయం మరియు పొత్తికడుపు యొక్క CT స్కాన్లు ఈ ప్రాంతాల్లోకి వ్యాప్తి చెందిందా అనుమానంతో ఉంటే సహాయపడతాయి.

మందులు

రొమ్ము గడ్డను బట్టి, వైద్యుడు మీ పరిస్థితికి చికిత్స చేయడానికి ఈ క్రింది మందులను సూచించవచ్చు.

 • యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు
  రొమ్ముల్లో గడ్డలకు ఇన్ఫెక్షన్ లేదా వాపు మూల కారణమైతే వైద్యుడు ఈ మందులను సూచించవచ్చు.
 • కీమోథెరపీ
  కీమోథెరపీ అనేది వ్యాధుల యొక్క వైద్యం కోసం మందులను ఉపయోగించడం. అయితే, ఈ పదాన్ని సాధారణంగా మందులను ఉపయోగించి చేసే కణుతుల యొక్క చికిత్సను సూచించడానికి ఉపయోగిస్తారు. అందువల్ల, రొమ్ముల్లో కణుతులు ఉంటే, ఈ ఔషధాలను శస్త్రచికిత్సానికి ముందుగా కరిగించడానికి లేదా దాని పరిమాణాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

రేడియోథెరపీ
రేడియోథెరపీ కణితి కణాలను చంపడానికి రేడియేషన్ను ఉపయోగిస్తుంది, గడ్డలను తొలగించడానికి లేదా శస్త్రచికిత్సకు ముందు గడ్డల యొక్క పరిమాణాన్ని తగ్గించడం కోసం దీనిని ఉపయోగిస్తారు.

శస్త్రచికిత్స
పై పద్ధతులు రొమ్ము గడ్డలని తగ్గించలేనప్పుడు లేదా క్యాన్సర్ నిర్ధారణ అయినపుడు, రొమ్ముల నుండి కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో, పూర్తి రొమ్ము తొలగింపును సూచించవచ్చు.

 • గడ్డ తొలగింపు (Lumpectomy)
  ఈ ప్రక్రియలో, శస్త్రచికిత్స చేసి రొమ్ముల్లో గడ్డలను తొలగిస్టార్, ఇది రొమ్ము యొక్క మిగిలిన కణజాలాన్ని దెబ్బతినకుండా నిరోధిస్తుంది.
 • రొమ్ము తొలగింపు (Mastectomy)
  ఒక ప్రక్రియలో రోగి యొక్క పరిస్థితి చికిత్సలో ఏ ఇతర పద్ధతి ఉపయోగపడన్నప్పుడు, రొమ్మును పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించబడుతుంది. కొన్నిసార్లు, గడ్డలు చంకలలో లేదా అంతర్లీన కండరాలకు కూడా వ్యాపించవచ్చు. ఆ సందర్భంలో, ఆ కణజాలం యొక్క కొంత భాగం కూడా రొమ్ముతో పాటు తొలగించబడుతుంది.

వనరులు

 1. Toomey A, Le JK. Abscess, Breast. [Updated 2019 Jan 11]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Breast self-exam
 3. Colin B Seymour, Carmel Mothersill. Breast cancer causes and treatment: where are we going wrong? Breast Cancer (Dove Med Press). 2013; 5: 111–119. PMID: 24648764
 4. Diana Ly, David Forman, Jacques Ferlay, Louise A. Brinton, Michael B. Cook. An International Comparison of Male and Female Breast Cancer Incidence Rates. Int J Cancer. 2013 Apr 15; 132(8): 1918–1926. PMID: 22987302
 5. Shannon Kispert, Jane McHowat. Recent insights into cigarette smoking as a lifestyle risk factor for breast cancer. Breast Cancer (Dove Med Press). 2017; 9: 127–132. PMID: 28331363
 6. Jingfang Cheng, Shijing Qiu, Usha Raju, Sandra R. Wolman, Maria J. Worsham. Benign Breast Disease Heterogeneity: Association with histopathology, age, and ethnicity. Breast Cancer Res Treat. 2008 Sep; 111(2): 289–296. PMID: 17917807
 7. Shannon Kispert, Jane McHowat. Recent insights into cigarette smoking as a lifestyle risk factor for breast cancer. Breast Cancer (Dove Med Press). 2017; 9: 127–132. PMID: 28331363
 8. Santen RJ. Benign Breast Disease in Women. [Updated 2018 May 25]. In: Feingold KR, Anawalt B, Boyce A, et al., editors. Endotext [Internet]. South Dartmouth (MA): MDText.com, Inc.; 2000-.
 9. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; BRCA Mutations: Cancer Risk and Genetic Testing
ऐप पर पढ़ें