జలుబు - Common Cold in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 10, 2018

March 06, 2020

జలుబు
జలుబు

సారాంశం

సాధారణ జలుబు అనేది సూక్ష్మ క్రిముల (వైరస్ల) వల్ల కలిగే అంటువ్యాధి. దీన్నే “పడిసెం” అని కూడా అంటారు. ఇది ఎగువ శ్వాసకోశ సంక్రమణం వల్ల దాపురిస్తుంది. ఇది గాలి మరియు ప్రత్యక్ష సంపర్కం ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. “రైన్నో సూక్ష్మక్రిములు” అనేవి 50% సాధారణ జలుబు కేసులకు కారణమవుతాయి. సాధారణ జలుబు అనేది ఒకసారి వచ్చింది అంటే సాధారణంగా 5-7 రోజుల వరకు కొనసాగుతుంది మరియు స్వీయ-పరిమితి స్థితిని కల్గి ఉంటుంది. అంటే ఎలాంటి వైద్య జోక్యం లేకుండా స్వయంగా తనకు తానుగా నయమవుతుంది. అయితే, ఫ్లూ లేదా ఇతర బాక్టీరియా సంక్రమణలతో కూడిన జలుబు అయితే గనుక పరిస్థితి దీర్ఘకాలిక జలుబుగా మారుతుంది. సాధారణ జలుబు యొక్క అత్యంత సాధారణ లక్షణాలు ధారాపాతంగా కారే ముక్కు లేదా మూసుకుపోయిన నాశికా రంధ్రాలు లేదా రెండు లక్షణాలు కూడా ఉండచ్చు. దురద గల్గిన గొంతు మరియు నిరంతరమైన తుమ్ములు కూడా జలుబు లక్షణాలే.

జలుబు అంటే ఏమిటి - What is Common Cold in Telugu

మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు జలుబుకు గురయ్యే ఉంటాం. ధారాపాతంగా కారే ముక్కు, మూసుకుపోయిన నాశికా రంధ్రాలు, దురద గల్గిన గొంతు మరియు నిరంతరంగా వస్తుండే తుమ్ములు వంటి లక్షణాలను మనందరం ఎదో ఒక సమయంలో అనుభవించే ఉంటాం. అయినప్పటికీ, సాధారణ జలుబుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియవు. అసలు సాధారణ జలుబు అంటే ఖచ్చితంగా ఏమిటన్నది మనలో పలువురికి అంతు చిక్కని విషయమే. సామాన్య జలుబుకు కారణాలు ఏమిటి? దీన్ని ఎలా నయం చేయవచ్చు? మరీ ముఖ్యంగా, సాధారణ జలుబు రాకుండా  మనం ఎలా నిరోధించగలం? వంటి విషయాలతో పాటు సాధారణ జలుబు గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఏమిటిది?

సాధారణ జలుబు అనేది ఎగువ శ్వాసకోశ సంక్రమణం మరియు సూక్ష్మ క్రిముల కారణంగా సంభవించే అంటు వ్యాధి. పడిసెం సోకడానికి 200 కన్నా ఎక్కువ రకాల సూక్ష్మ జీవులు కారణమవుతాయని నమ్మటం జరుగుతోంది. అందులోను, "రైనోవైరస్" అత్యంత ప్రబలమైన జలుబు కారకంగా గుర్తించబడింది, ఎందుకంటే ఈ రైనోవైరస్ ఒక్కటే మొత్తం జలుబు కేసుల్లో దాదాపు సగం కేసులకు కారణమవుతోంది. సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర  సూక్ష్మ జీవులు ఏవంటే కరోనావైరస్, రెస్పిరేటరీ సింసిటియల్ వైరస్, ఇన్ ఫ్లుఎంజావైరస్ మరియు పరాన్ ఫ్లుఎంజావైరస్.

సాధారణ జలుబు ఎలా వ్యాప్తి చెందుతుంది?

జలుబు అంటు రోగం. పైన పేర్కొన్న సూక్ష్మ జీవుల్లో ఎదో ఒకదానివల్ల ఇప్పటికే జలుబుకు గురై బాధపడుతున్న వ్యక్తుల ద్వారా మీకిది సులభంగా అంటుకోవచ్చు. ఇలా జలుబు చేయడం లేదా అంటురోగంగా దాపురించడమనేది గాలి ద్వారా, ఇప్పటికే జలుబు సోకిన వ్యక్తితో భౌతిక సంబంధాలు లేదా ఈ సూక్ష్మజీవులను తమ ఉపరితలాలపై కల్గిన కంప్యూటర్ కీబోర్డు, మొబైల్ ఫోన్లు, తలుపు గుబ్బలు (door knobs) మరియు స్పూన్ ల వంటి వస్తువులను మనం తాకినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు జరుగుతుంది. ఇప్పటికే జలుబు సోకి బాధపడుతున్న వ్యక్తితో మీరు ఏదైనా ప్రత్యక్ష చర్మ సంబంధాన్ని కలిగి ఉండడం, లేదా వారి వ్యక్తిగత వస్తువులను ఉపయోగించకూడదని వైద్యులు  సిఫార్సు చేస్తారు. ఒకవేళ, అలా చేయడం ద్వారా మీకు సాధారణ జలుబు అంటుకునే అవకాశాలు పెరగొచ్చు. మీకు తెలిసినట్లుగానే, సాధారణ జలుబు యొక్క ప్రధాన కారణాల్లో ఒకటి ఏమంటే ఇది గాలిలో వ్యాప్తి చెందే జలుబు, సూక్ష్మ క్రిములతో మలినమైన సాంక్రామిక బిందువుల ద్వారా సులువుగా వ్యాప్తి చెందవచ్చు. ఈ సాంక్రామిక బిందువులు జలుబు సోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినపుడు లేదా వారితో మాట్లాడినపుడు ముక్కు లేదా నోటిద్వారా చుట్టుపక్కల వారిపైకి వెదజల్లబడుతాయి. ఈ బిందువుల్లో సూక్ష్మ జీవులు ఉంటాయి. అలా విడుదలైన సాంక్రమిక జలుబు బిందువులు చుట్టుపక్కలవారి నాసికారంధ్రాలు లేదా గొంతు మార్గం ద్వారా వారి శరీరంలోకి ప్రవేశించినపుడు త్వరగా జలుబు సోకుతుంది.

ప్రారంభంలో, మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ ఈ అంటురోగాలకు వ్యతిరేకంగా తెల్లరక్త కణాల సహాయంతో పోరాడతాయి. కానీ కొన్నిసార్లు  మీ శరీరం లోని మీ రోగనిరోధక వ్యవస్థ జలుబుకారక సూక్ష్మజీవులపై దాడికి సిద్ధంగా ఉండకపోవచ్చు, దీని కారణంగా, మీ ముక్కు మరియు గొంతులో మంటను ఏర్పరచి, తదనంతరం, ముక్కులో గొంతులో గళ్ళ లేక శ్లేష్మం చోటు చేసుకోవడం, తద్వారా ముక్కు మూసుకుపోవడం జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించినపుడు వీటికి  వ్యతిరేకంగా పోరాడటానికి మన దేహంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చాలా శక్తిని ఉపయోగిస్తుంది. దానివల్ల తరచూ అలసట, బలహీనమైన భావన మీకు కలగొచ్చు.

మీకు తెలుసా?

మనం వర్షంలో తడవడం మూలంగా కానీ లేదా మరేదైనా కారణం వల్ల దేహం తడిగా తయారై, చలి పుట్టి, తద్వారా అనారోగ్యం మరియు సాధారణ జలుబు రావడం జరుగుతుందనే అపోహ మనందరిలో ఉంది. కానీ ఇటీవలి అధ్యయనాలు నిర్ధారించిందేమంటే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా మనస్సు భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు లేదా గొంతు మరియు ముక్కు అలెర్జీకి గురైనపుడు సామాన్య జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని.

Immunity Booster
₹288  ₹320  10% OFF
BUY NOW

జలుబు యొక్క దశలు - Stages of Common Cold in Telugu

అనేక రకాలైన సూక్ష్మజీవుల కారణంగా సాధారణ జలుబు సంభవీస్తుంది గనుక దాని లక్షణాల యొక్క తీవ్రత మరియు  పరిణామదశ జలుబు సోకిన వ్యక్తి వ్యక్తికీ మారవచ్చు. సాధారణంగా, జలుబు సోకిన 2-3 రోజులలో జలుబు పరిస్థితిని తెలిపే లక్షణాలు మనిషిలో కానరావడం ప్రారంభమవుతాయి. అధ్యయనాలు నిర్ధారించిందేమంటే జలుబు లక్షణాలు రోగుల్లో వివిధ రకాలుగుంటాయని, అంటే చాలా తేలికపాటి స్థాయి నుండి తీవ్రంగా ఉండే స్థాయి వరకు లక్షణాలు ఉంటాయని.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి సామాన్య జలుబు సోకినప్పుడు ముక్కులో శ్లేష్మం మాత్రమే కలిగి ఉండవచ్చు, మరికొందర్లో  గొంతు నొప్పి, గొంతు దురద, ఒంటి నొప్పులు మరియు జ్వరము వంటి జలుబు లక్షణాలు అన్నీ కలిగి ఉండవచ్చు. రోగనిరోధకత మరియు సదరు వ్యక్తి యొక్క శరీరం కలిగిఉండే వ్యాధి-పోరాట సామర్థ్యాన్ని బట్టి జలుబు లక్షణాలు శరీరంలో అభివృద్ధి చెందుతాయని అధ్యయనాల్లో గమనించబడింది.

ఎక్కువగా, సాధారణ జలుబుతో బాధపడేవాళ్ళు 7 నుంచి 10 రోజులలోపల జలుబు నయమై తిరిగి సాధారణ స్థితికి చేరుకొంటారు. కానీ కొన్ని వైద్య కేసుల ప్రకారం, సూక్ష్మజీవుల సంక్రమణ కారణంగా జలుబుకు గురైన వ్యక్తి తిరిగి పూర్తిగా స్వస్థత పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ పరిస్థితి మళ్లీ ఆ జలుబు వైరస్ రకం, అలాగే జలుబుకు గురైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.

సాధారణ జలుబు యొక్క లక్షణాలు - Symptoms of Common Cold in Telugu

సాధారణంగా, సాధారణ జలుబు యొక్క లక్షణాలు మనిషిలో  ప్రారంభమవడానికి లేదా పైకి గోచరించడానికి కొంత కాలం పడుతుంది. జలుబు లక్షణాలు తక్షణమే కనిపించడం అనేది చాలా అరుదు.

అంతేకాక, సాధారణ జలుబు మరియు ఫ్లూ లక్షణాల మధ్య తేడాను గుర్తించలేక మనలో చాలామంది తరచుగా కంగారు పడిపోతుంటాం, ఎందుకంటే ఫ్లూజ్వరం  మరియు సాధారణ జలుబు లక్షణాలు దాదాపు ఒకేరకంగా ఉంటాయి. అయితే, ఈ రెండింటి లక్షణాల మధ్య పూర్తి వ్యత్యాసాన్ని తెలుసుకొన్నట్లైతే రెండు జబ్బుల్ని మెరుగ్గా ఎలా నయం చేసుకోవాలి అనేదాని గురించి మీకు బాగా తెలిస్తుంది. తద్వారా, మీరు వైద్యుడివద్దకు చికిత్స కోసం వెళ్ళాలా వద్దా అనేదానిని నిర్ణయించుకోవడంలో కూడా మీకు సహాయపడుతుందిది. 

సాధారణ జలుబు యొక్క ముక్కు-సంబంధిత లక్షణాలు:

 • మూసుకుపోయిన  ముక్కు
 • మీ కళ్ళు, బుగ్గలు, మరియు నుదిటిపై (సైనస్ ప్రాంతం) ఒత్తిడి లేక నొప్పి ఉండవచ్చు.
 • కారే ముక్కు
 • మీకు ముక్కు బరువుగా ఉన్నట్లు తోచవచ్చు.
 • మీరు దేనినీ వాసన చూడలేకపోతారు, అంటే మీ ముక్కు ఘ్రాణశక్తిని కోల్పోతుంది.
 • నిరంతరంగా తుమ్ములు రావచ్చు
 • ముక్కు నుండి మీ గొంతు భాగంలోకి కఫము లేదా శ్లేష్మం గొంతుగుండా దిగబడుతోందని మీరు భావిస్తారు

సాధారణ జలుబు యొక్క తల మరియు గొంతు-సంబంధిత లక్షణాలు:

 • మీకు కళ్ళలో నీరు కారొచ్చు.
 • తేలికపాటి నుండి ఓ మోస్తరు తలనొప్పి
 • మీకు గొంతులో మంట, చికాకుగా ఉండవచ్చు
 • మీకు కఫంతో కూడిన దగ్గు రావచ్చు.
 • మీకు శోషరసగ్రంథులు వాయవచ్చు (swelling)

సాధారణ జలుబులో శరీర-సంబంధ లక్షణాలు:

 • మీకు సులభంగా అలసిపోయి బలహీనపడిపోయినట్లుంటుంది.  
 • మీకు చలి పట్టొచ్చు.
 • మీకు తేలికపాటి నుండి తీవ్రమైన ఒంటినొప్పులుండొచ్చు.
 • మీకు జ్వరం వచ్చినట్లు అనిపించొచ్చు లేదా జ్వరం రానూవచ్చు.
 • మీకు ఛాతీ నొప్పి అనుభూతి ఉండవచ్చు
 • మీకు శ్వాస తీసుకోవటానికి కష్టంగా ఉండవచ్చు.

జలుబు కారణాలు మరియు ప్రమాద కారకాలు - Common Cold Causes and Risk Factors in Telugu

సాధారణ జలుబు ఎందుకు వస్తుంది?

సాధారణ జలుబు స్పర్శ చేత మరియు గాలిలో వ్యాప్తి చెందిన సూక్ష్మజీవుల కారణంగా అంటుకునే వ్యాధి అవడం మూలంగా జలుబు సోకిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినపుడు లేదా వారితో మాట్లాడినపుడు ముక్కు లేదా నోటిద్వారా చుట్టుపక్కల వారిపైకి సూక్ష్మజీవులుండే ద్రవబిందువులు వెదజల్లబడుతాయి, చుట్టుపక్కల గాల్లోకి కూడా వ్యాపిస్తాయి. ఈ బిందువుల్లో సూక్ష్మ జీవులు ఉంటాయి. అలా విడుదలైన సాంక్రామిక జలుబు బిందువులు చుట్టుపక్కలవారి  నాసికారంధ్రాలు లేదా గొంతు మార్గం ద్వారా గాలి పీల్చినపుడు వారి శరీరంలోకి ప్రవేశించినపుడు జలుబు సోకుతుంది. జలుబును కల్గించే  సూక్ష్మక్రిములను తమ ఉపరితలాలపై కల్గిన వస్తువులను ఎవరైనా  తాకినప్పుడు అవి సోకి జలుబు రావచ్చని మీకు ఇప్పటికే తెలుసు. జలుబు సంక్రమించిన వ్యక్తి తాకిన తలుపు గుబ్బ (door knob) లేక బోల్ట్, టెలిఫోన్, బొమ్మలు లేదా బాధిత వ్యక్తి ఉపయోగించే టవల్ వంటి వస్తువుల్ని మనం తాకినా, ఉపయోగించినా ఆ సూక్ష్మజీవులు మనలో ప్రవేశించి మనకు జలుబును కల్గిస్తాయి. సాధారణ జలుబుకు కారణమయ్యే అతి సాధారణ సూక్ష్మజీవి  “రైన్నోవైరస్” అని పరిశోధన చెబుతోంది. ఈ సూక్ష్మజీవి 3 గంటల పాటు వస్తువుల ఉపరితలంమీద లేదా శరీర భాగాలలో మనుగడ సాధించగలదని పరిశోధన సూచిస్తోంది.

అనేక రకాల సూక్ష్మజీవుల్ని (వైరస్లు) వైద్య పరిశోధకులు గుర్తించి వాటి నమూనాలను వివిధ జాతుల నుండి సేకరించి ఒకే సమూహంగా కలిపారు. ఆ సూక్ష్మ జీవులసమూహంలోని ఈ జాతులు / సమూహాలు కింది విధంగా ఉన్నాయి:

 • మానవ రైనోవైరస్
 • కరోనా వైరస్
 • పరైన్ ఫ్లుఎంజా (Parainfluenza) వైరస్
 • అడెనో వైరస్

సాధారణ జలుబును కల్గించే కొన్ని ఇతర రకాల సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి, ఇవి విడివిడిగా వర్గీకరించబడ్డాయి. సింసిటియల్ వైరస్ అనేది వాటిల్లో ఒకటి. అయినప్పటికీ, పరిశోధనలు కొనసాగుతున్నాయి.  పరిశోధకులు ఇప్పటికీ నిర్దిష్ట రకాలైన జలుబుకారక వైరస్లను గుర్తించలేకపోయారు.

ప్రమాద కారకాలు

మేము ఇంతకు ముందు చర్చించినట్లుగా సాధారణ జలుబు కారణంగా నష్టాలు మరియు ఉపద్రవాలూ కూడా ఉన్నాయి. సాధారణ జలుబును కలిగింపజేసే కారకాలను క్రింద తెలుపుతున్నాం.

 • వయస్సు:
  శిశువులు మరియు చిన్నపిల్లలు సాధారణ జలుబుకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని శాస్త్రీయ పరిశోధన సూచించింది. ఎందుకంటే, పసిపిల్లల రోగనిరోధక వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్నందున, అలాంటి శిశువులు, చిన్నపిల్లలకు సాధారణ జలుబు సోకితే వారి తెల్ల రక్త కణాలు (WBC లు) ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సరిపోవు.

 • శీతోష్ణస్థితి మార్పు :
  కొంతమంది శీతాకాలంలో లేదా వర్షాకాలంలో సాధారణ జలుబుకు గురవుతారు, మరియు జలుబు లక్షణాలు వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి కూడా. ఈ విషయం గురించి అనుభవైక్యమైన పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎందుకంటే, ఈ సీజన్లలో చాలా మంది ఇంట్లోనే  ఉండటానికి ఇష్టపడతారు, అందుచేతనే తరచుగా ఒకరికొకరు తాకబడుతూ నిరంతర సంపర్కంలో ఉంటారు, తద్వారా జలుబున్నవారి నుండి లేని వాళ్లకు కూడా సోకుతుంది.

 • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ :
  కొందరు వ్యక్తులకు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఓ ప్రధానమైన సవాలుగా ఉండి, సాధారణ జలుబు మరియు ఇతర వ్యాధికారక దాడులకు వారిని బాలి చేస్తుంది. కాబట్టి, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కల్గిన వారు మళ్లీ మళ్లీ జలుబుకు లోనవుతుంటారు.  పరిశోధకులు గట్టిగా సూచించేదేమంటే భావోద్వేగ అసమతుల్యత మరియు అలసట బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. తద్వారా, పునరావృత జలుబు మరియు ఇతర వ్యాధులకు కొందరు గురవుతుంటారు.

Nasal Congestion
₹224  ₹249  10% OFF
BUY NOW

సాధారణ జలుబు నివారణ - Prevention of Common Cold in Telugu

ఆచరణ పరంగా ఎవరికైనా సాధారణ జలుబు రాకుండా పూర్తిగా నివారించడం అనేది అసాధ్యం. ఇందుకు బాహ్య కారణాలెన్నో. అలాంటి కారణాల్లో ప్రముఖమైనవి పర్యావరణం మరియు చుట్టూ ఉన్నవాళ్ళే. అయితే, మనం మరియు మా కుటుంబసభ్యులకు కాలానుగుణంగా లేదా పదే పదే కొన్ని సూక్ష్మజీవుల ద్వారా రోగాలు సంక్రమించకుండా నిరోధించడానికి ప్రయత్నించదగ్గ కొన్ని చర్యలున్నాయి.

క్రమం తప్పకుండా మీ చేతులను కడగాలి

క్రమం తప్పకుండా చేతులను కడగడమనేది సాధారణ జలుబు నుండి నిరోధించే ఉత్తమమైన మరియు భద్రమైన మార్గంగా చెప్పవచ్చు. చేతులను కడుక్కోవడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి సార్వత్రిక ప్రాంతాలను సందర్శించిన్నపుడు అక్కడ పలువురు ముట్టుకునేటువంటి తలుపుల గుబ్బలు (door knobs), మెట్లనెక్కేటపుడు ఊతకోసం లభించే స్టెయిర్ కేసు సపోర్ట్ కమ్ములు వగైరాలను తాకడం జరుగుతుంది. కనుక చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఉత్తమం.   

ఒకవేళ మీరు జలుబు బాధిత వ్యక్తికి సమీపంలో ఉన్ననూ, ఆ వ్యక్తి నుండి మీ దరికి చేరే సూక్ష్మక్రిములను నాశనం చేయడానికి మీకుండే తరచు చేతులను కడుక్కునే అలవాటు సహాయపడుతుంది. మీరు సార్వత్రిక స్థలాలకు  వెళ్లేటప్పుడు చేతుల్ని శుభ్రపరుచుకునే “హ్యాండ్ శానిటైజర్ల”ను మీతో పాటు తీసుకెళ్ళటం ఉత్తమం. దీనిద్వారా మీకు జలుబును దాపురింపజేసే సూక్ష్మక్రిములు, ఇతర రోగకారక క్రిములను చంపడానికి ఇది సహాయపడుతుంది. అంతేగాక, మీ పిల్లలకు కూడా చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలి.

మీరు సార్వత్రిక ప్రదేశానికి వెళ్ళినపుడు సూక్ష్మ క్రిములుండే  ఉపరితలాలను తాకడం, లేదా జలుబు సోకిన వ్యక్తిని కలిసిన తర్వాత మీ చేతులతో మీ ముక్కు, నోరు  మరియు కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తాకవద్దు. చేతుల్ని శుభ్రపర్చుకునేంతవరకూ ఇలా మీ ముఖాన్ని తాకకుండా నివారించడం మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు మీ శరీరంలోకి సూక్ష్మక్రిములు ప్రవేశించకుండా ఆపినవారవుతారు.

సిగరెట్ల పొగ, అందులో ఉండే తారు వంటి పదార్ధం మన ముక్కు మరియు ఊపిరితిత్తుల శ్వాసమార్గాల్లో మంటను పుట్టించడమో లేక చికాకుపరచడమో జరుగుతుంది. అంతేగాక ధూమపానం వల్ల సాధారణ జలుబు, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే సంభావ్యత ఎక్కువగా ఉంది. మీరు ఆశ్చర్యపోవచ్చు కాని మీరు పొగతాగడం కేవలం మీకే కాదు మీ పిల్లలపైన కూడా ప్రభావం చూపి సాధారణ జలుబును మీకు, మీ పిల్లలక్కూడా దాపరింపజేసే అవకాశం కల్పిస్తుంది.

మీ కుటుంబంలోని సభ్యులెవరికైనా సాధారణ జలుబు వచ్చినపుడు ఒకసారి వాడి పారవేయదగ్గ పాత్రల్ని (use and throw utensils) మరియు స్నానాలగదిలో కాగితపు తువ్వాళ్ల (Paper napkins) వంటి వాటిని వాడమని వారికి సిఫారస్ చేయండి. ఇలా జాగ్రత్త తీసుకోవడం మూలంగా జలుబుకారక సూక్ష్మజీవులు మొత్తం కుటుంబ సభ్యులకందరికీ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

వంటగదిలో మరియు బాత్రూంలో కాగితపు తువ్వాళ్లతో మీ చేతులను పొడిగా ఉంచండి:

అంటువ్యాధులు అనేక రోజులు వస్త్రపు తువ్వాళ్లలో దాగివుంటాయని అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి. అందువల్ల, పరిశుభ్రతను కాపాడటం మరియు తరచూ  తువ్వాళ్లను ఉతకడం చాలా మంచిది. ప్రత్యామ్నాయంగా కుటుంబానికి చెందిన ప్రతి సభ్యునికి ప్రత్యేక టవల్ మరియు అతిథుల కోసం ప్రత్యేకమైన తువ్వాల్ ఉండాలి.

ఇంకనూ ముఖ్యమైన విషయమేమంటే మీకే గనుక జలుబు సోకినట్లయితే, మీరు టాయిలెట్లో ఉపయోగించే కాగితపు రుమాళ్ళను (paper knapkins) సరిగ్గా పారవేయాల్సిన అవసరం ఉంది. కాగితపు రుమాళ్ళను ఉపయోగించిన తర్వాత సరిగా తొలగించకపోతే, అది సూక్ష్మజీవుల యొక్క పెంపకానికి/పెరుగుదలకు  దారితీయవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి:

వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం వల్ల సాధారణ జలుబును నివారించడానికి వీలవుతుంది, ఎందుకంటే పోషకాహారం రోగనిరోధకతను పెంచుతుంది కాబట్టి. ఆరోగ్యవంతమైన జీవనశైలి అంటే సరైన నిద్ర, ఆరోగ్యకరమైన పోషకాహారం తినడం, క్రమమైన వ్యాయామం దైనందిన జీవితంలో అలవర్చుకోవడమన్నమాట. దీని వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా వ్యాధికారక సూక్ష్మక్రిములతో పోరాడగలదు.

మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించండి:

ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మరియు భావోద్వేగ అసమతుల్యతను కలిగిన వ్యక్తుల మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. అలాంటి వ్యక్తులు సులభంగా వ్యాధికారక సూక్ష్మజీవులకు బలవుతారు. అందువల్ల మీరెలాంటి ఒత్తిడికి గురి కాకూడదని, ఒకవేళ ఒత్తిడి పరిస్థితులుంటే, వాటినుండి బయటపడే మార్గాలను అన్వేషించాలని మరియు ఉద్రిక్తతలు మరియు ఒత్తిడి పరిస్థితులను దూరంగా ఉంచాలని మీకు సిఫార్సు చేయడమైంది.

సాధారణ జలుబు యొక్క నిర్ధారణ - Diagnosis of Common Cold in Telugu

సామాన్యంగా సాధారణ జలుబు నిర్ధారణ కోసం మనలో చాలామంది డాక్టర్ను అరుదుగా సందర్శిస్తారు. కానీ లక్షణాలు తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ను సందర్శించడం మరియు దానిని రోగ నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. లక్షణాలు ఒక వారం లేదా అంతకన్నా ఎక్కువ కాలం కొనసాగితే, మీరు రక్త పరీక్ష (ప్రాథమిక రక్త గణన పరీక్ష లేదా CBC) చేయించుకోవడం మంచిది, వెంటనే డాక్టర్ను ఆలస్యం చేయకుండా సంప్రదించండి. మీ డాక్టర్ ఇది సాధారణ జలుబేనా  లేదా ఏదైనా ఇతర వైరల్ సంక్రమణమా అని గుర్తించడంలో సహాయపడగలడు.

మీరు ఒకవేళ సాధారణ జలుబుతో బాధపడుతున్నట్లయితే, దానిక్కారణమైన సూక్ష్మ జీవి ఏడు నుంచి పది రోజుల వ్యవధి  మీ శరీరంలోనే ఉండగలదని గమనించండి. ఫ్లూ వంటి పరిస్థితి కూడా 7 రోజుల్లోనే నయమవుతుంది అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ఏమైనప్పటికీ, లక్షణాలు ఒక వారంలోనే తగ్గిపోకుండా ఉంటే, మీ శరీర వ్యవస్థపై కొన్ని ఇతర రోగకారక క్రిములు (జెర్మ్స్) దాడి చేసుంటాయి.

మీకొచ్చిన లక్షణాలు ఫ్లూజ్వరానికి సంబంధించినవా లేదా సాధారణ జలుబు లక్షణాలేనా అని తెలుసుకోవడానికి, మీ వైద్యులు మీకు  రక్త పరీక్షను సూచించవచ్చు. ఫ్లూ మరియు సాధారణ జలుబు-రెండింటి లక్షణాలు చాలా దగ్గరి పోలికల్ని కల్గి ఉంటాయి కాబట్టి, సరైన రోగనిర్ధారణ చేసుకున్నట్లైతే సరైన చికిత్స పొందడానికి సులభంగా ఉంటుంది, తద్వారా శీఘ్ర ఉపశమనం పొందడానికీ  వీలవుతుంది.

సాధారణ జలుబుకు చికిత్స - Common Cold Treatment in Telugu

సాధారణ జలుబుకు నిర్దిష్టమైన చికిత్స లేదు. జలుబు పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ డాక్టర్ మీకు మల్టీవిటమిన్ మందుల్ని సిఫారస్ చేయవచ్చు. జలుబు చికిత్స రెండు ప్రధాన విషయాలపై దృష్టి పెడుతుంది

 • మీరు జలుబు నుంచి వెంటనే ఉపశమనం పొంది వ్యాధి నుంచి కోలుకోవడానికి.
 • జలుబుకు కారణమైన సూక్ష్మ క్రిములతో మీ శరీరం సమర్థవంతంగా పోరాడేటందుకు సహాయపడటానికి.

సాధారణ జలుబు చికిత్సా సమయంలో బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు మీకు సూచిస్తారు.

 • రాత్రి 10-12 గంటలు పాటు మీరు బాగా నిద్రపోవాలని  మీకు సిఫార్సు చేయడమైనది
 • మీరు సాధ్యమైనంత ఎక్కువ నీరు తీసుకోవాలి. అలా నీళ్లెక్కువగా తాగడంతో గొంతులో అడ్డంకిగా ఏర్పడే గళ్ళ ((శ్లేష్మం) ని కరిగించడానికి వీలుపడుతుంది.
 • సాధారణ జలుబు చికిత్సకు ప్రత్యేకమైన ఔషధం లేదని మీకు ఇప్పటికే తెలుసు. కానీ సాధారణ జలుబు లక్షణాలను అనుభవిస్తున్నవారికి తగిన చికిత్స చేస్తే వారు తగినంత ఉపశమనం పొంది త్వరగా కోలుకుంటారు.
 • జ్వరం, ఒంటినొపులతో బాధపడే చిన్నపిల్లలకు శరీర ఉష్ణోగ్రత 100.5 ఎఫ్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నపుడు పారాసెటామాల్ మందును వైద్యులు సిఫార్సు చేస్తారు. మీ వైద్యుడిని సంప్రదించకుండా ఏ ఔషధం తీసుకోవద్దని మీకు మనవి.
 • జ్వరం మరియు ఒంటినొపులతో బాధపడుతున్న వయోజనులు పారాసెటామాల్ మందును సురక్షితంగా తీసుకోవచ్చు, అయితే వైద్యులను సంప్రదించిన తర్వాతనే తీసుకోవాలి. ఒక రోజు కంటే ఎక్కువగా  జ్వరం కొనసాగితే రక్తపరీక్ష అవసరమవుతుంది. రక్తపరీక్ష చేయించుకోవడంవల్ల ఇతర వ్యాధులు లేవని నిర్ధారించుకునేందుకు వీలవుతుంది.
 • గొంతు నొప్పికి చికిత్స చేయడానికి, ఒక కప్పు వేడి ఉప్పునీటిని (లవణం) పుక్కిలింతకు ఉపయోగిస్తారు. దీనిద్వారా ఉపశమనం లభిస్తుంది.

సూడోపీడ్రిన్ వంటి మందుల నిర్దిష్ట మోతాదులు పూడుకుపోయిన నాసికారంధ్రాలని మరియు గొంతుమార్గాన్ని అవరోధరహితంగా చేయడంలో సహాయపడతాయి. నాశికా రంధ్రాలని, గొంతుమార్గాన్ని అవరోధరహితంగా చేసే ఆక్సిమెటజోలిన్ వంటి (డికంజెస్టెంట్లు) మందులు కూడా సాధారణ జలుబుతో బాధపడేవారికి వ్యాధిని భరించటానికి మరియు ఉపశమనకారిగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయినప్పటికీ, ఆరోగ్య నిపుణులు హెచ్చరించేదేమంటే ఈ డికంజెస్టెంట్లను 3-5 రోజులకు మించి ఉపయోగించరాదని. ఎందుకంటే వీటిని ఎక్కువరోజులు ఉపయోగిస్తే కొన్ని  దుష్ప్రభావాలతో పాటు నాశికారంధ్రాలు మరియు గొంతులో శ్లేష్మం ఏర్పడి, అడ్డంకి పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది. సూడోయిఫెడ్రైన్ మందు రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుందని మరియు గుండె వేగంగా కొట్టుకునేట్లు చేస్తుందని పరిశోధన సూచిస్తోంది. బాక్టీరియా సంక్రమణ కల్గిందని మీ వైద్యుడు అనుమానించినట్లయితే మాత్రమే మీకు యాంటీబయాటిక్స్ సూచించబడతాయి.

గుండె జబ్బులు, అధిక రక్తపోటు, క్యాన్సర్, డయాబెటిస్ మరియు థైరాయిడ్ వంటి రోగపరిస్థితుల వల్ల మీరు బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జలుబుకు మందులు సేవించండి. మీ అంతట మీరే స్వయంనిర్ణయంతో ఔషధప్రయోగాలు చేయకండి.

Cough Relief
₹719  ₹799  10% OFF
BUY NOW

సాధారణ జలుబుతో వచ్చే ఉపద్రవాలు - Common Cold Complications in Telugu

సాధారణ జలుబు సాధారణంగా ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించకుండా నయమైపోతుంది. చాలా సందర్భాలలో సామాన్య జలుబు డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం లేకుండానే నయమవుతుంది. అయితే, దీని లక్షణాలు 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడ్ని సంప్రదించాల్సిన అవసరం ఉండవచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో, తీవ్రమైన రొమ్ము పాడిసెం (శ్వాసనాళాల వాపు/బ్రాంకైటిస్) లేదా ఆస్త్మా దాడి వంటి మరొక సమస్యను ఇది ప్రేరేపిస్తుంది. చికిత్స చేయని జలుబు లేదా నిరంతరం కొనసాగే  సాధారణ జలుబు ఫలితంగా దాపురించే కొన్ని పరిస్థితులు గురించి ఇక్కడ వివరిస్తున్నాం.

 • తీవ్రమైన చెవి నొప్పి (తీవ్రమైన చెవి సంక్రమణం)  
  చెవిలోని కర్ణభేరి ప్రదేశంలో ద్రవం చేరుకొని తీవ్రమైన నొప్పిని కల్గిస్తూ చెవుల నుండి ద్రవాలు కారడం “తీవ్రమైన చెవి సంక్రమణం”గా చెప్పబడుతుంది. ఇదో బాధాకరమైన పరిస్థితి . ఈ చెవి నొప్పి తరచూ జ్వరంతో పాటు 1-2 వారాల మధ్య నయమైపోతుంది. వేడి కాపడాల్ని (హాట్ కంప్రెస్ లు) ఉపశమనాలుగా సిఫారసు చేయవచ్చు దీనికి. చికిత్స చేయకుండా వదిలేసినట్లైతే పరిస్థితికి తీవ్రంగా మారి ప్రమాదం దాపురించే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఈ చెవి నొప్పి  వచ్చినట్లైతే చెవి డ్రాప్స్ వంటి మందులు సూచించబడతాయి. కొన్ని సందర్భాల్లో, వైద్యుడు చెవి సంక్రమణను నియంత్రించడానికి కొన్ని నొప్పి నివారిణులు మరియు యాంటీబయాటిక్స్లను సిఫారసు చేస్తాడు.
   
 • తీవ్రమైన ముక్కుదిబ్బడ (సైనసిటిస్)
  ముక్కుదిబ్బడ అనేది సైనస్ గుహ (కన్ను, ముక్కు బుగ్గల వెనుక ఉండే సందులు)  సంక్రమణం వల్ల దాపురించేది. ముక్కుదిబ్బడ సమయంలో ముక్కు మూసుకుపోవడం, నొప్పి, రుచి తెలియకపోవడం, జ్వరం, గొంతు దురద, గొంతు మంట,  మరియు చెడువాసనతో శ్వాస ఉంటాయి. దీన్ని చికిత్స లేకుండా వదిలేస్తే సైనస్ గుహలో సూక్ష్మ జీవులు గూడుకట్టుకుపోతాయి, తద్వారా సుదీర్ఘ చికిత్స అవసరమయ్యే స్థితి కల్గుతుంది.
 • ఆస్త్మా అటాక్
  మన శరీరంలో శ్వాసమార్గం యొక్క ఆకస్మిక సంకోచం కారణంగా శ్వాస కష్టాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి ఇలా తయారవడానికి శ్వాసమార్గం వాపుకు గురవుతుందని గమనించబడింది. వైద్యులు అస్తిమా-సంబంధ పరిస్థితికి  చికిత్స చేయడానికి ఇన్హేలర్లు వంటి తక్షణ ఉపశమనం కల్గించే మందులను సిఫార్సు చేస్తారు. మీరు లేదా మీకు సమీపంలో ఉన్న ఎవరైనా ఆస్తమా దాడికి గురవుతుంటే వెంటనే డాక్టర్ను పిలవడమో లేదా ఆసుపత్రికి తరలించడం చేయండి.
   
 • న్యుమోనియా
  న్యుమోనియా, పేరు సూచించినట్లుగానే “స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా” అనే  బాక్టీరియా కారణంగా న్యుమోనియా వ్యాధి సంభవిస్తుంది. ఈ సూక్ష్మక్రిమి ఊపిరితిత్తులలో సంక్రమణకు కారణమవుతుంది మరియు ఒకటి లేదా రెండు ఊపిరితిత్తులలోని వాయుమార్గాలకు వాపును సంక్రమింపజేస్తుంది. ఇది ప్రమాదకర పరిస్థితి, తక్షణ వైద్యం అత్యవసరం. న్యుమోనియా తరచు తీవ్రమైన దగ్గు, శ్లేష్మం (గళ్ళ) పడటం, జ్వరం, ఛాతీ నొప్పి మరియు శ్వాసతీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది.  మీకు ఆస్త్మాతో పాటు న్యుమోనియా కూడా ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలని మీకు సిఫారస్ చేయడమైనది.
   
 • తీవ్రమైన రొమ్ముపడిశము (శ్వాసనాళరోగము)
  తీవ్రమైన రొమ్ముపడిశము (బ్రోన్కైటీస్) కొన్ని సాధారణ సూక్ష్మజీవుల కారణంగా దాపురిస్తుంది. కొన్ని వారాలు లేదా మరికొన్ని ఎక్కువరోజులు బాధించే తీవ్రమైన రొమ్ము పడిశం లక్షణాలేవంటే దగ్గు, గొంతు మరియు ఛాతీ నొప్పి మరియు ఊపిరి ఇబ్బందులు వంటివి.  సాధారణంగా, వైద్యుడు ఈ వ్యాధిని విశ్లేషించడానికి X- రేని సిఫార్సు చేస్తాడు, మరియు ఏదైనా ఇతర అంతర్గత పరిస్థితి లేదంటాడు.


వనరులు

 1. National Health Service [Internet] NHS inform; Scottish Government; Common Cold
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Common Cold and Runny Nose
 3. National Health Service [Internet]. UK; Common Cold
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Common Colds: Protect Yourself and Others
 5. Ronald B. Turner. Rhinovirus: More than Just a Common Cold Virus . The Journal of Infectious Diseases, Volume 195, Issue 6, 15 March 2007, Pages 765–766. [Internet] Infectious Diseases Society of America.

జలుబు కొరకు మందులు

Medicines listed below are available for జలుబు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.