వేప నూనెను వేప చెట్టు యొక్క పండ్లు మరియు విత్తనాల నుండి పొందవచ్చు. విస్తృత శ్రేణి సౌందర్య ఉత్పత్తలు మరియు ఔషధాలలో వేప నూనె ఒక ముఖ్యమైన అంశం. ఇది భారత ఉపఖండానికి చెందిన ఒక సతత హరిత వృక్షం (ఎవర్ గ్రీన్). ఎండలో ఎండబెట్టిన లేదా కృత్రిమంగా ఎండబెట్టిన వేప గింజల నుండి నూనె తీయబడుతుంది. దీనిని సేకరించిన తర్వాత, మలినాలను తొలగించడానికి వేప నూనె ఫిల్టర్ చేయబడుతుంది (వడకట్టబడుతుంది). ఈ నూనె యొక్క మిశ్రమము మరియు నాణ్యత అనేవి సాధారణంగా సంగ్రహణ (ఎక్సక్ట్రేషన్) పద్ధతి మరియు ఉపయోగించిన ప్రక్రియలపై ఆధారపడి ఉంటాయి.
వేప నూనెకు బలమైన మరియు ఘాటైన వాసన ఉంటుంది. ఇది సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. భారతదేశంలో వేప చెట్లకు ప్రతి సంవత్సరం 3.5 మిలియన్ టన్నుల విత్తనాలను కాస్తాయని మరియు దానితో సంవత్సరానికి 700,000 టన్నుల నూనెను ఉత్పత్తి చేయవచ్చని ఒక అంచనా.
వేప నూనెను ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయం, ఔషధం మరియు సౌందర్య ఉత్పత్తలలో ఉపయోగిస్తారు. ఈ నూనెను ఉపయోగించి వేప సబ్బులు, వేప షాంపూలు, నూనెలు, బాడీ లోషన్లు, మాయిశ్చరైజర్లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీనికి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని కూడా అంటారు అందువల్ల క్రిమినాశకారులను (యాంటీసెప్టిక్) తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
సేంద్రీయ రైతులు పురుగులు మరియు తెగుళ్ళ వల్ల పంట దెబ్బతినకుండా ఉండటానికి వేప నూనెను పురుగుమందుగా ఉపయోగిస్తారు. వేప నూనె యొక్క ఈ లక్షణం దోమలు, చీమలు, బొద్దింకలు, నల్లులు వంటి ఇళ్లలో ఉండే పురుగులను తొలిగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
వేప గురించి ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: ఆజాడిర్కటా ఇండికా (Azadirachta indica)
- కుటుంబం: మెలియాసియే (Meliaceae); మహోగని కుటుంబం
- సాధారణ నామం: వేప, భారతీయ లిలక్
- సంస్కృత నామం: నింబ్, అరిస్టా
- ఉపయోగించే భాగాలు: ఆకులు, విత్తనాలు మరియు పండ్లు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: వేప చెట్టు భారతదేశం మరియు బర్మాకు చెందినది. ప్రస్తుతం, ఇది ఆసియా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో మరియు పశ్చిమ అర్ధగోళంలో (hemisphere) ని ఉష్ణమండల ప్రాంతాలలో ఉంటుంది. ఇది భారతదేశంలోని ఉత్తర శీతల రాష్ట్రాలతో సహా దాదాపు అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది. అయితే, వేప చెట్ల యొక్క అధిక సంఖ్య వాయువ్య భారతదేశంలో మరియు ఉత్తర ప్రదేశ్‌లో ఉంటుంది. భారతదేశంలో, వేపను సాధారణంగా రహదారి పక్కన మొక్కగా పెంచుతారు, ఎందుకంటే ఇది ఏడాది పొడవునా ఆకులను కలిగి ఉంటుంది. బర్మా, ఇండోనేషియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఘనా, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా వేప చెట్లు ఉంటాయి.