“జీవితం నీకు నిమ్మకాయలిస్తే నిమ్మరసం చేసేయ్” అన్న సామెతను మీరు వినే ఉండవచ్చు.కానీ అందుకు బదులుగా జీవితం మీకు తియ్య తియ్యని బత్తాయినిస్తే? తాజా మరియు ఆరోగ్యకరమైన తీపి బత్తాయి రసం చేసి తాగేసేయండి. బత్తాయిని హిందీలో “మోసంబి” అని పిలుస్తారు, ఫ్రెంచ్లో దీనిని "లిమిటైర్ డౌక్స్ " అని పిలుస్తారు; వియత్నాంలో "క్విట్ గియా"; స్పానిష్లో "లిమా డూల్స్"; తెలుగులో "బత్తాయి పండు", తమిళం లో "కట్టుక్కూటీ”", మలయాళం లో "మధుర నారంగా" మరియు గుజరాతీలో "మోసంబి" అని పిలుస్తారు.
బత్తాయి పండు యొక్క మూలం ఇండోనేషియా మరియు చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలల్లో ఉన్నట్లు కనబడుతుంది, కానీ దీనిని తరువాత భారతదేశానికి చెందిన పండుగా పేర్కొన్నారు. బత్తాయి పండు మూలం మేఘాలయ మరియు నాగాలాండ్ పర్వతాలకు చెందినది అని ‘అగ్రికల్చర్ రివ్యూ, 2004 సంచికలో ప్రచురించిన ఓ నివేదికలో పేర్కొనబడింది. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో ఒకటి మరియు జూలై మరియు ఆగస్టు నెలల్లో పుష్కలంగా లభిస్తుంది. బత్తాయిలు చెట్టుకు కాస్తాయి. బత్తాయి చెట్లను నాటాక 5 నుండి 7 సంవత్సరాల మధ్యలో పంట పండటం ప్రారంభమవుతుంది. బత్తాయి పండ్ల పంట ఉష్ణమండలాలు మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ బత్తాయి పండును చూచి తరచుగా నిమ్మపండు లేదా పెద్దనిమ్మకాయనెమో అని పొరబాటుగా అనుకోవడం జరుగుతుంది, ఈ గందరగోళం ఎందుకంటే బత్తాయి పండు, నిమ్మ-గజనిమ్మ రెండింటి నుండి ఏర్పడ్డ సంకర జాతి కాబట్టి. నిమ్మ పండు మరియు గజనిమ్మకాయ రెండూ కూడా అదే నేపథ్యాన్నీ మరియు నిమ్మ జాతి (సిట్రస్) కి చెందినవి మరియు ఒకే రకమైన పోషక లక్షణాలను కలిగి ఉంటాయి. తేడా మాత్రం వాటి బాహ్య రూపాల్లో మాత్రమే చూడవచ్చు.
బత్తాయిలు సాధారణంగా నిమ్మకాయల లాగా కనిపిస్తాయి కానీ, పరిమాణంలో నిమ్మకాయ కంటే పెద్దవిగా ఉంటాయి మరియు రుచిలో తియ్యగా ఉంటాయి. రుచికి, బత్తాయిలు కొంతవరకు నారింజ పండు రుచిని పోలి ఉంటాయి. బత్తాయి పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ B9 మరియు విటమిన్ సి లు సమృద్ధిగా ఉంటాయి.
బత్తాయి పండు గురించి ప్రాథమిక వాస్తవాలు
- వృక్షశాస్త్రం (బొటనికల్) పేరు: సిట్రస్ లిమేట్టా (Citrus limetta)
- కుటుంబం: సిట్రస్ ఫ్రూట్, రూటేసియే
- సాధారణ పేరు: స్వీట్ లైమ్ (తియ్యని నిమ్మ), మోసంబి
- సంస్కృత నామం: జంబీరం
- ఉపయోగించే భాగాలు: తొక్క, గుజ్జు, మరియు గింజలు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బత్తాయి ఇండోనేషియా మరియు చైనా నుండి ఉద్భవించిందని, మరియు భారతదేశం యొక్క కేంద్ర మరియు ఉత్తర ప్రాంతాలలో కూడా ఇది జన్మను దాల్చి ఉంటుందని నమ్ముతారు. నేడు, ఈజిప్టు, సిరియా, పాలస్తీనా, ఉష్ణమండల అమెరికా, ఆగ్నేయాసియాలోని భాగాలు మరియు మధ్యధరా ప్రాంతాలలో కూడా బత్తాయి పంటను పండిస్తున్నారు. బత్తాయి ఫ్లోరిడా మరియు కాలిఫోర్నియాలోని కొన్ని భాగాలలో బాగా ఇష్టపడి పండించే పండు.
- ఆసక్తికరమైన వాస్తవం: క్రిస్టోఫర్ కొలంబస్ 1493 లో తన రెండో సముద్రయానంలో నిమ్మ జాతి పండ్ల విత్తనాలను, బహుశా నిమ్మపండ్ల విత్తనాలే కావచ్చు, తనవెంట తీసుకెళ్లి వెస్ట్ ఇండీస్, మెక్సికో మరియు ఫ్లోరిడాల్లో విస్తృతంగా వ్యాపింపజేశాడు.